20కోట్ల భూమిని 2కోట్లకే ఇచ్చేశారా! : టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై హైకోర్టులో పిల్
ఖమ్మం : కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ చెంతకు చేరిన ఖమ్మం టీఆర్ఎస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ పై ఓ ఆసక్తికర కథనం వినిపిస్తోంది. దాదాపు రూ.20 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని అధికారులు ఆయనకు కేవలం రూ.2కోట్లకే కట్టబెట్టారన్నది ఆ కథనం సారాంశం. తొలుత ఎమ్మెల్యేకు సంబంధించిన ఓ ప్రైవేటు విద్యాసంస్థ ఆ భూమిలో కొంతమేర కబ్జా చేయగా.. తాజాగా అదే భూమిని అధికారికంగా కట్టబెట్టారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
కాగా, గతంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి సేకరించిన స్థలాన్ని ఇప్పుడు అజయ్ కుమార్ కు ప్రభుత్వం కేటాయించినట్టు తెలుస్తోంది. నిజానికి ప్రభుత్వ పరిధిలో ఉన్న ఈ భూమిని ప్రభుత్వ అవసరాలకో లేక బడుగు వర్గాల ప్రజల కోసమో వినియోగించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. ఇదే క్రమంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కు చెందిన మమతా విద్యా సంస్థలు ఈ స్థలాన్ని ఆనుకుని ఉండడంతో.. అందులో కొంతమేర కబ్జా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

2009లో రెవెన్యూ శాఖ చేసిన సర్వేలోను ఇదే విషయం స్పష్టమైందన్న వాదనలున్నాయి. దాంతో మమతా విద్యా సంస్థలకు అప్పట్లో అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. ఆ తర్వాత నోటిసుల విషయం ఏమైందన్న దానిపై స్పష్టత లేకపోగా.. సదరు సంస్థ కబ్జా పెట్టిన భూమిని ఆ సంస్థకే అధికారులు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టులోను ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
ఖమ్మం జిల్లా మంచుకొండకు చెందిన మందడపు సుధాకర్.. ఈ భూ కేటాయింపులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ వేశారు. భూ కేటాయింపులకు బాధ్యులైన జిల్లా కలెక్టర్, రెవెన్యూ కార్యదర్శి, సర్వే కమిషనర్ లతో సహా ఎమ్మెల్యే కూడా ఒత్తిళ్లకు పాల్పడ్డారంటూ పువ్వాడ అజయ్ పేరు కూడా జత చేస్తూ పిల్ దాఖలు చేశారు. దీంతో ఖమ్మం పాలిటిక్స్ పువ్వాడ అజయ్ భూ కేటాయింపుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
ఇదంతా ఇలా ఉంటే.. నిజానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద సేకరించిన భూమిని ఆయకట్టు సేద్యం కోసం వినియోగించాల్సి ఉన్నా.. ఖమ్మం పట్టణం మరింతగా విస్తరించిన దృష్ట్యా అది సాధ్యపడడం లేదు. దీంతో ఆ స్థలంపై కన్నేసిన పువ్వాడ అజయ్ కు చెందిన మమతా విద్యాసంస్థలు.. ఆ స్థలం కోసం దరఖాస్తు చేసుకుని.. అజయ్ సిఫారసులు ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చి భూమిని దక్కించుకుంటున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications