కేసీఆర్ సర్కారు సంచలనం: కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్, భూకబ్జా నిజమేన్న నివేదిక
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్ ప్రకటన విడుదల చేసింది. ఈటల బర్తరఫ్ విషయాన్ని మీడియాకు వెల్లడించింది గవర్నర్ కార్యాలయం.

కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్
కలెక్టర్ నివేదిక ఈటెల రాజేందర్ కుటుంబం హకీంపేట, అచ్చంపేట భూకబ్జాలకు పాల్పడినట్లు వెల్లడించింది. ఈ మేరకు నివేదికను సీఎం కేసీఆర్‌కు ఆదివారం సాయంత్రం అందడంతో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్ బర్తరఫ్ నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఈటెల వద్ద ఉన్న వైద్యారోగ్యశాఖను సీఎంకు శనివారం కేటాయించిన విషయం తెలిసిందే.

ఈటల మంత్రి పదవికి రాజీనామా చేయకపోవడం..
ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ మంత్రి పదవికి రాజీనామా చేస్తారని ప్రభుత్వం వేచిచూసినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన రాజీనామా చేయకపోవడంతో బర్తరఫ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలక నేతగా ఉన్న రాజేందర్‌ను ఇలా తొలగించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఈటల రాజేందర్ కుటుంబం భూకబ్జా చేసింది..
కాగా, ఈటల రాజేందర్‌పై అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణలు రావడంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా కలెక్టర్ ఆదివారం సర్వే నిర్వహించారు. ఈటల భూములను కబ్జా చేసినట్లు కలెక్టర్ నివేదికలో వెల్లడించారు. జమున హేచరీస్ ఆధీనంలో అసైన్డ్ భూములు ఉన్నట్లు గుర్తించినట్లు నివేదికలో పేర్కొన్నారు. మొత్తం 20 మంది బాధితులకు సంబంధించిన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. బెదిరించి భూములను బాధితుల నుంచి లాక్కున్నట్లు, అనుమతి లేకుండా అసైన్డ్ భూముల్లో చెట్లను తొలించినట్లు, అనుమతి లేకుండానే జమున హేచరీస్‌లో పౌల్ట్రీ షెడ్లు నిర్మించినట్లు నివేదికలో మెదక్ కలెక్టర్ పేర్కొన్నారు.

కలెక్టర్ నివేదిక సీఎం కేసీఆర్‌కు అందిన వెంటనే బర్తరఫ్ నిర్ణయం
ఈటెల రాజేందర్ కుటుంబం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో భూములను కబ్జా చేసిందని నివేదిక స్పష్టం చేసింది. ఈ నివేదికను ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్‌కు అందజేశారు. ఈ క్రమంలోనే ఈ సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే, తాను ఏ తప్పు చేయలేదని, ఎవరి భూములు ఆక్రమించుకోలేదని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని అన్నారు. తనపై కుట్ర జరుగుతోందని, కుట్రలు చేసేవారు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని ఈటెల రాజేందర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications