దేశంలోనే అతిపెద్ద బంగారు విమాన గోపురం.. కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం, మంత్రులు
తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం నేడు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. అలానే ఆయనతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్టు సమాచారం.
దేశంలోనే అతి పెద్దది..
ఈ ఆలయంలో నిర్మించిన బంగారు విమాన గోపురం దేశంలోనే అతి పెద్దదిగా రికార్డు సాధించింది. గోపురం ఎత్తు 50.5 అడుగులు ఉండగా.. గోపురం మొత్తం వైశాల్యం 10,759 చదరపు అడుగులు ఉంది. స్వర్ణ తాపడం కోసం దాదాపు 68 కిలోల బంగారం వినియోగించారు. ఈ పంచతల స్వర్ణ శోభిత బంగారు విమాన గోపురం తాపడం కోసం మొత్తం రూ.80 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి డిసెంబర్ 1 2024 నాడు పనులు ప్రారంభం అయ్యాయి. ఫిబ్రవరి 18న పనులు పూర్తయ్యాయి.

సీఎం పర్యటన కారణంగా ఉదయం 9 గంటల నుంచి భక్తులకు దర్శనాలు నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. 12:25 నుండి 12:45 వరకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ నిత్య పూజా కార్యక్రమాలలో కూడా స్వల్ప మార్పులు చేపట్టారు. అలానే గుడిలోని నిత్య కైంకర్యాలలో మార్పులను చేసారు ఆలయ అధికారులు. ఉదయం, సాయంత్రం బ్రేక్ దర్శనాలను ఈరోజుకు క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తోంది. రూ.150 టికెట్ దర్శనాలు, నిత్య కళ్యాణోత్సవాలు, పుష్పార్చనలను సైతం అధికారులు రద్దు చేసినట్టు తెలుస్తోంది. ఉచిత దర్శనాలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
సీఎం షెడ్యూల్..
ముఖ్యమంత్రి ఉదయం 11:00 గంటలకు హెలికాప్టర్ లో యాదగిరిగుట్టకు చేరుకుంటారు. అనంతరం 11:25 నుండి 12:15 వరకు జరిగే కుంభాభిషేకంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు సీఎం తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం తెలంగాణలోని ప్రముఖ ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ది గాంచింది. హాద ఋషి తపస్సుకు మెచ్చి ఆయన కోరిక మేరకు.. నరసింహ స్వామి జ్వాలా, యోగా, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చారని చరిత్ర చెబుతోంది. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అంటారు. అలానే మహర్షి కోరిక మేరకు ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా ఉన్నాడని పండితులు చెబుతుంటారు. మెట్ల మార్గాన వెళ్తే దారిలో శివాలయం కూడా కనబడుతుంది.












Click it and Unblock the Notifications