ఇందిరమ్మ ఇండ్లు వీళ్లకే.. లబ్ధిదారుల లిస్టు రెడీ..! ఏజ్ లిమిట్ ఆధారంగా..?
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఒకటి ఇందిరమ్మ ఇళ్ల పథకం. పేద మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా వీలైనన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి పేదలకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో లబ్ధిదారుల ఖాతాల్లో ఇటీవల నగదు జమ కార్యక్రమం కూడా పూర్తి చేసింది.
అయితే తాజాగా ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. 2 లక్షల 10 వేల ఇండ్లు అర్హుల జాబితా ఫైనల్ అయిందని ప్రకటించారు. ఇప్పటికే 24 వేల ఇండ్ల నిర్మాణం ప్రారంభం అయ్యిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.130 కోట్లు చెల్లించామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఎలాంటి తప్పులు లేకుండా.. పారదర్శకంగా అర్హుల ఎంపిక చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా సమాన స్థాయిలో ఇండ్ల కేటాయింపులు జరుగుతున్నాయని ఈ మేరకు వివరించారు.
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల నేపథ్యంలో ధరల నియంత్రణకు రెండు రోజుల్లో కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ అధ్యక్షతన ఈ కమిటీ పని చేస్తుందని స్పష్టం చేశారు. స్టీల్ రేటు గతేడాది నుంచి ఎలా ఉందో అంచనా వేసి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి వివరించారు. మరోవైపు గిరిజనులైన చెంచులకు ఇళ్లు ఇస్తామని తెలిపారు. చెంచులకు 9,200 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

అయితే ఇందిరమ్మ ఇళ్లకు ఏజ్ లిమిట్ ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను మంత్రి పొంగులేటి ఖండించారు. లబ్ధిదారులకు ఎలాంటి వయో పరిమితి లేదన్నారు. అర్హులైన అందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మొద్దని సూచించారు.
మరోవైపు ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను తక్షణమే గుర్తించి పరిష్కరించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు పథకం చాలా కీలకమని స్పష్టం చేశారు.
ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు నిర్మించి ఇస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు రూ. 5 లక్షలు అందిస్తారు. ఉద్యమకారులకు 250 చదరపు గజాలు ఇంటి స్థలం అందిస్తారు.












Click it and Unblock the Notifications