తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు: 14న ఫలితాలు
హైదరాబాద్: తెలంగాణలోని ఐదు జిల్లాల పరిధిలో ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. దాదాపు అన్ని చోట్లా 90 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. ఎన్నికలు పోలింగ్ ముగియడంతో క్యాంపులు, రిసార్ట్ రాజకీయాలకు తెరపడింది.
కరీంనగర్ జిల్లాలో రెండు, ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి గానూ మొత్తం 26 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఆయా జిల్లాల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మొత్తం 5326 మంది ఓటర్ల కోసం 37 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా స్థానిక సంస్థల్లో ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. కరోనా నిబంధనలను పాటిస్తూ పోలింగ్ ప్రక్రియ సాగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 99.69 శాతం పోలింగ్ నమోదైంది. 1324 ఓటర్లకు గాను 1320 ఓట్లు పోలయ్యాయి. సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ ఓటు వేశారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఓటు వేశారు.
ఆదిలాబాద్ ఎన్నికల పోలింగ్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు మధ్య పోలింగ్ ప్రక్రియ ముగిసింది. కాగా, వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ ద్వారా ఓటింగ్ ప్రక్రియ మొత్తం రికార్డు చేశారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సుల్ని స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు.
కాగా, లోకల్‌బాడీ కోటాలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల సంఘం. అయితే ఇందులో ఆరు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ఈ ఆరు చోట్ల అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలిచారు. మిగిలిన ఆరు స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. ఎన్నికలు జరిగిన ఐదు జిల్లాల్లోనూ గులాబీ దళానికే మెజార్టీ ఉంది. అయితే క్రాస్ ఓటింగ్ భయంతో జాగ్రత్తపడింది అధికార పార్టీ. క్యాంపులు ఏర్పాటు చేసింది. ఖమ్మం, మెదక్ జిల్లాల్లో కాంగ్రెస్ పోటీలో ఉంది. కరీంనగర్‌లో టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ మేయర్ రవీందర్‌సింగ్ పోటీ చేశారు. ముందుజాగ్రత్తగా ఓటర్లను క్యాంప్‌లకు తరలించిన అధికార పార్టీ..ఓటర్లు చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంది.












Click it and Unblock the Notifications