ఎంబీఏ చదివి లాటరీ పేరుతో దేశవ్యాప్తంగా 4 కోట్లకు టోకరా
హైదరాబాద్: ఎంబీఏ చదివి నగరంలో లాటరీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని గురువారం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్ అడిషనల్ కమిషనర్ టీ ప్రభాకరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన పట్టూరి వీరభద్రరావు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశాడు.
అనంతరం బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రి సమీపంలో నివసిస్తూ బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని బంజారా ప్లాజాలోని మూడో ఫ్లోర్‌లో ప్లానెట్ ఐ ట్రేడర్స్ పేరుతో 2012లో వ్యాపారం ప్రారంభించాడు. ఐదుగురు యువతులను టెలికాలర్స్‌గా నియమించుకుని గిల్ట్ నగలు, ఆయుర్వేద ఉత్పత్తులను అమ్మేవాడు.
ఆ తర్వాత 20 మంది యువతులను టెలికాలర్స్‌గా నియమించుకున్నాడు. అయితే వ్యాపార నిర్వహణకు, ఖర్చులకు లాభం సరిపోకపోవడంతో కొత్త మార్గాలను ఎంచుకున్నాడు. ఓల్‌ఎక్స్, క్వికర్ నుంచి టెలిఫోన నంబర్లును అధిక సంఖ్యలో సేకరించి టెలీకాలర్స్ చేత ఆన్‌లైన్ గేట్‌వే ద్వారా ఫోన్లు చేయించేవాడు.

లాటరీలో 6 వేల విలువ చేసే 3 గ్రాముల బంగారం వచ్చిందని నమ్మించేవారు. కేవలం రూ.600 పంపిస్తే బంగారం పంపిస్తాని, పోస్టల్ చార్జీల కోసం అదనంగా రూ. 42 పంపాలని వారిని నమ్మంచేవాడు. వీరి మాటలు విని బుట్టలో పడి డబ్బు పంపించగానే రూ.20 విలువ చేసే తెల్లని నకిలీ ముత్యాల గొలుసును పంపేవారు.
బాలానగర్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి బి.శ్రీకాంత ఈ విధంగానే మోసపోయి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, ప్లానెట్ ఐ ట్రేడర్స్ సంస్థపై దాడి చేసి నిందితుడు వీరభద్రరావుని అరెస్ట్ చేయడంతోపాటు టాటా డొకోమో 30 సిమ్ కార్డులతో కూడిన జీఎస్‌ఎం గేట్‌వే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
వీటితో పాటు ఐ ట్రేడర్స్ పేరుతో ఉన్న ఐదు రబ్బరు స్టాంపులు, టెలీకాలర్స్ జీతాలు, రోజువారీ ఖర్చులతో కూడిన ఐదు బుక్స్, నాలుగు చెక్ బుక్‌లు, ఒక అటెండెన్స్ రిజిస్టర్‌లను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications