ఇద్దరి మధ్య: ప్రియుడు పారిపోయాడు, భర్త కాదు పొమ్మన్నాడు
హైదరాబాద్: నమ్మి వెంట వెళ్తే ప్రియుడు పారిపోయాడు, తిరిగి వచ్చి అడిగితే భర్త కాదు పొమ్మన్నాడు. దిక్కు తోచని పరిస్థితిలో ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసుకుని చిత్తగించారు. ఈ సంఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగింది.
ఆ యువతి పెళ్లికి ముందే ఓ యువకుడిని ప్రేమించింది. కానీ వేరే వ్యక్తితో పెళ్లయింది. పెళ్లి చేసుకున్నా మరిచిపోలేక ప్రియుడితో వెళ్లిపోయింది. అయితే, ప్రేమికుడు మధ్యలో చెప్పాపెట్టకుండా చిత్తగించాడు. దాంతో ఆమె భర్త వద్దకు తిరిగి వచ్చింది. అతను స్వీకరించడానికి నిరాకరించాడు.
దాంతో న్యాయం కోసం ఆ యువతి ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొంగరకలాన్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకంది. కొంగరకలాన్‌కు చెందిన 20 ఏళ్ల యువతి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది.

అదే గ్రామానికి చెందిన రాఘవేందర్‌ను గత నాలుగేళ్లుగా ప్రేమిస్తూ వచ్చింది. అయితే, ఆమెకు మరో యువకుడితో మే 13వ తేదీన వివాహమైంది. ఈ స్థితిలో ఆగస్టు 13వ తేదీననే యువకుడి భర్తను బెదిరించి యువతిని తన వెంట తీసుకుని వెళ్లాడు.
విజయవాడలో ఓ రోజు గాడిపిన వారిద్దరు తిరుగు ప్రయాణంలో నల్లగొండ జిల్లా కోదాడ వద్ద దిగారు. రాఘవేందర్ యువతిని ఇంటికి పంపించి, తాను ఎటో వెళ్లిపోయాడు. తిరిగి ఆమె భర్త వద్దకు వచ్చింది. కానీ అతను స్వీకరించలేదు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లింది.
ఈ నెల 28వ తేదీన ఆమె ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. దీంతో రాఘవేందర్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయారు. ప్రియుడితో పెళ్లి చేయించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతోంది.












Click it and Unblock the Notifications