TSRTC: పండగల వేళ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) పండగల వేళ ప్రయాణికులకు శుభవార్త అందించింది. దసరా పండుగకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మీరు ప్రయాణిస్తున్నారా!? కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సొంతూళ్లకు వెళ్తున్నారా!? అయితే మీరు రూ.11 లక్షల నగదు బహుమతులు గెలుపొందే అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది ప్రభుత్వ రంగ సంస్థ టీఎస్ఆర్టీసీ.
అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనుకాల మీ పూర్తి పేరు, ఫోన్ నంబర్ ని రాసి బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ ల్లో వాటిని వేయడమే.

రాఖీ పౌర్ణమి మాదిరిగానే దసరాకు లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసి.. వారిని ఘనంగా సత్కరించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ల‌క్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు రూ.11 లక్షల నగదు బ‌హుమ‌తులు అందించనుంది. ప్రతి రీజియన్‌కు ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు.. మొత్తం 110 మందికి ఒక్కొక్కరికి రూ.9900 చొప్పున బహుమతులను ఇవ్వనుంది.

 TSRTC festival offers to passengers.

అక్టోబర్ 21 నుంచి 23 తేది వరకు, మళ్లీ 28 నుంచి 30 తేదిల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ఆయా తేదిల్లో ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్ ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లలో వేయాలి. బస్టాండ్లు, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో పురుష, మహిళలకు వేర్వేరుగా డ్రాప్ బాక్స్ లను సంస్థ ఏర్పాటు చేయనుంది.

లక్కీ డ్రా అనంతరం డ్రాప్ బాక్స్‌లను సంబంధిత ఆర్ఎం కార్యాలయాలకు చేర్చి.. ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి 10 మంది చొప్పున విజేతలను అధికారులు ఎంపిక చేస్తారు. మొత్తం 11 రీజియన్ లలో కలిపి 110 విజేతలను ఎంపిక చేస్తారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు నగదు బహుమతులను అందజేస్తారు.

సెప్టెంబర్ 31 న రాఖీ పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ లక్కీ డ్రా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ లక్కీ డ్రాకు మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. 33 మంది మహిళా ప్రయాణికులను ఎంపిక చేసి వారికి రూ.5.50 లక్షల నగదు పురస్కారం అందజేసి ఘనంగా సంస్థ సత్కరించింది. రాఖీ పౌర్ణమి స్పూర్తితో దసరా, దీపావళి, సంక్రాంతి, తదితర పండుగలకు లక్కీ డ్రా నిర్వహించాలని సంస్థ నిర్ణయించింది. ఈసారి పురుషులకు కూడా అవకాశం కల్పించడం గమనార్హం.

'తెలంగాణలో బతుకమ్మ, దసరా చాలా పెద్ద పండుగలు. ఈ పర్వదినాల్లో పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. వారిలో కొంతమందికి రాఖీ పౌర్ణమి మాదిరిగా లక్కీ డ్రా నిర్వహించి బహుమతులను సంస్థ అందజేయనుంది. ఈ నెల 21 నుంచి 23 తేది వరకు, మళ్లీ 28 నుంచి 30 తేదిల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ఆయా తేదిల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ లక్కీ డ్రాకు అర్హులే. టికెట్ వెనకాల పేరు, ఫోన్ నంబర్ రాసి డ్రాప్ బాక్స్ లలో వాటిని వేయాలి. ప్రతి బస్టాండ్, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో డ్రాప్ బాక్స్ లను సంస్థ ఏర్పాటు చేస్తుంది. రాఖీ పౌర్ణమి లాగే దసరా లక్కీ డ్రాలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తారని ప్రభుత్వ రంగ సంస్థ అయిన టీఎస్ఆర్టీసీ ఆశిస్తోంది' అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు.

కాల్ సెంటర్.. ప్రత్యేక బస్సులు

దసరా లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆయన సూచించారు. కాగా, బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటోందని, ప్రయాణికుల సౌకర్యార్థం 5265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. అక్టోబర్ 13 నుంచి 24వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్నీ ప్రత్యేక బస్సులను నడపాలని అధికారులకు ఆదేశించామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+