చంద్రగ్రహణం ఎఫెక్ట్: తెలంగాణాలో ప్రముఖ ఆలయాల మూసివేత, పునః దర్శనాలిలా!!
తెలంగాణా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు నేడు చంద్రగ్రహణం కారణంగా మూతపడుతున్నాయి. చంద్ర గ్రహణ కాలంలో ఎప్పుడూ ఆలయాలను తెరచి ఉంచరు. ఈ క్రమంలో తెలంగాణాలోని ప్రముఖ ఆలయాలు ఎప్పుడు మూతపడతాయి. తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతాయి అన్న వివరాల విషయానికి వస్తే
తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణలోని యాదాద్రి పుణ్య క్షేత్రంలో కొలువైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయాన్ని ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రేపు ఉదయం ఐదు గంటల వరకు మూసివేయనున్నారు. ప్రధాన ఆలయంతోపాటు ఉపాలయాలు కూడా మూసివేయనున్నారు. తిరిగి రేపు ఉదయం 5 గంటలకు ఆలయాన్ని సంప్రోక్షణ నిర్వహిస్తారు అర్చకులు. ఆపై రేపు రేపటి నుండి యధావిధిగా దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.

ఇక వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని చంద్ర గ్రహణం కారణంగా మూసి వేస్తున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. రాజరాజేశ్వర స్వామి ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలు 28న సాయంత్రం 4.15 గంటల నుంచి మూసివేస్తున్నట్లు తెలిపారు. తిరిగి గ్రహణానంతరం 29న తెల్లవారుజామున 3.40 గంటలకు ఆలయంలో పుణ్యహవచనం, సంప్రోక్షణ, పూజల అనంతరం భక్తులకు స్వామి వారి దర్శనం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఎండపల్లి మండలం కోటిలింగాలలోని శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి మరుసటి రోజు ఉదయం వరకు మూసి వేయనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఈఓ చెప్పారు. ఆదివారం చంద్రగ్రహణం ముగిసిన తర్వాత భక్తులకు యధావిధిగా స్వామివారి దర్శనం కల్పించడం జరుగుతుందని ఈవో పేర్కొన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్ లోని జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మూసివేశారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి రేపు ఉదయం 5.30 గంటల వరకూ ఈ ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. రేపు ఉదయం 5 గంటల 30 నిమిషాల తర్వాత ఆలయ సంప్రోక్షణ నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.












Click it and Unblock the Notifications