పవన్ తో మోహన్ బాబు చెట్టాపట్టాల్ - పూనం కౌర్ ఓటు ఎవరికో చెప్పేసారు : మరో గంట పోలింగ్ పొడిగింపు...!!
"మా" ఎన్నికల పోలింగ్ లో నటీ నటులు నవరసాలను పండిస్తున్నారు. ఓట్లు వేసే దగ్గర గొడవ పడటం..బయటకు వచ్చి తామంతా ఒక్కటేనని చెప్పటం ఉదయం నుంచి జరుగుతూనే ఉంది. ఇక, ప్రకాశ్ రాజ్ వర్సెస్ విష్ణు గా జరుగుతున్న "మా" వార్ ఒక దశలో మెగా వర్సెస్ మంచు అన్నట్లుగా మారింది. ప్రకాశ్ రాజ్ కు చిరంజీవి మద్దతు ఉందని స్వయంగా నాగబాబు వెల్లడించారు. విష్ణు గెలుపు కోసం మోహన్ బాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

పోలింగ్ కేంద్రంలో పవన్-మోహన్ బాబు స్పెషల్ అట్రాక్షన్
ఇక, రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక నుంచి ఏపీ ప్రభుత్వం పైన ఫైర్ అయిన పవన్ కళ్యాణ్ "మా" పోలింగ్ ప్రారంభమైన వెంటనే పోలింగ్ కేంద్రానికి వచ్చారు. తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిరంజీవి..మోహన్ బాబు ఫ్రెండ్స్ అంటూ వ్యాఖ్యానించారు. "మా" ఎన్నికల్లో ఇటువంటి పరిస్థితి అవసరం లేదని చెప్పారు. ఎందుకు ఇంత టార్గెట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా అంటూ ప్రశ్నించారు. అయితే, మోహన్ బాబు గురించి పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేదిక నుంచి కీలక వ్యాఖ్యలు చేసారు.

భుజాల పైన చేతులతో ఇద్దరూ ఏకాంతంగా మంతనాలు
రానున్న రోజుల్లో మోహన్ బాబు విద్యా సంస్థల నుంచి ఆన్ లైన్ లో ఫీజులు వసూలు చేయాలని చెప్పారు. సీఎం జగన్ మీ బంధువు కదా..ఆయనతో మాట్లాడండి అంటూ సూచించారు. దీనికి మోహన్ బాబు సైతం స్పందించారు. నెమ్మదిగా నన్ను లాగావుగా అంటూ.."మా" ఎన్నిక ల తరువాత స్పందిస్తానని..ముందు విష్ణు ప్యానెల్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ రోజు ఓటు వేయటానికి వచ్చిన పవన్ తో మోహన్ బాబు కాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు. పవన్ భుజం నైన చేతులేసి పక్కకు తీసుకెళ్లిన మోహన్ బాబు ..ఏకాంతంగా చాలా సేపు ముచ్చటించుకున్నారు.

పూనం కౌర్ కీలక వ్యాఖ్యలు..ఓటు గురించి
ఇక, ఈ ఎన్నికల వేళ ఓటు వేసేందుకు పూనం కౌర్ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. తన ఓటు ప్రకాశ్ రాజ్ కు వేసినట్లుగా బయటకు చెప్పేసారు. రాజకీయాల కోసం సినిమా హీరోలను టార్గెట్ చేయకూడదని సూచించారు. ప్రకాశ్ రాజ్ తో కలిసి పోలింగ్ కేంద్రం వద్ద అందరినీ పలకరించారు. ఇక, ఉదయం పోలింగ్ కేంద్రంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలతో పోలింగ్ కొద్ది సేపు నిలిచిపోయింది. దీంతో..ప్రకాశ్ రాజ్ - విష్ణు ఎన్నికల అధికారులతో మాట్లాడారు. పోలింగ్ సమయం పొడిగించాలని అభ్యర్ధించారు.
Recommended Video

పోలింగ్ మరో గంట పొడిగింపు
దీనికి ఎన్నికల అధికారులు అనుమతించారు. ఇప్పటి వరకు "మా" ఎన్నికల్లో 580 మంది ఓట్లు వేసారు. 62 శాతం పోలింగ్ నమోదైనట్లుగా వెల్లడించారు. గతం కంటే పోలింగ్ శాతం పెరిగింది. మధ్నాహ్నం 3 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని విష్ణు కోరారు. ఇక, ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేస్తున్న జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఓటు వేసేందుకు వచ్చిన రోజాతో కలిసి పోలింగ్ కేంద్రం వద్ద సందడి చేసారు. నాగార్జున సైతం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాత్రికి 8 గంటల తరువాత ఫలితం వెల్లడి కానుంది.












Click it and Unblock the Notifications