Madhya Pradesh Results 2023: మధ్యప్రదేశ్ లో బీజేపీ హవా-హోరాహోరీ నుంచి ఏకపక్షంగా..
మధ్యప్రదేశ్ అసెంబ్లీకి గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఇవాళ ప్రారంభమైంది. ఉదయం కౌంటింగ్ ప్రారంభం కాగానే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధుల మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు కనిపించింది. అయితే క్రమంగా బీజేపీ లీడ్ లోకి వచ్చేసింది. తాజాగా అందుతున్న ఫలితాల సరళి ప్రకారం చూస్తే బీజేపీ భారీ ఆధిక్యంతో మధ్యప్రదేశ్ ను కైవసం చేసుకునే దిశగా సాగుతోంది. ఈసారి ఎట్టిపరిస్ధితుల్లోనూ అధికారం తమదే అని భావించిన కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తప్పేలా లేదు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్త 230 సీట్లు ఉన్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ సాగింది. ఇందులో బీజేపీ అభ్యర్ధులు స్పష్టమైన ఆధిక్యం సాధిస్తున్నారు. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ఆధిక్యం గమనిస్తే కాషాయ పార్టీ మ్యాజిక్ మార్క్ దాటేసింది. ఇదే ట్రెండ్ కొనసాగితే బీజేపీ సులువుగా మధ్యప్రదేశ్ లో అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే మధ్యలో ఏడాదిన్నర మినహాయించి దాదాపు 15 ఏళ్ల బీజేపీ పాలనకు ప్రజల ఆమోదం లభించినట్లే.

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో విజయం కోసం 116 సీట్లు అవసరం కాగా.. ప్రస్తుతానికి బీజేపీ 140 సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ 69 సీట్లలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి, పీసీసీ అధ్యక్షుడు కమల్ నాథ్ సైతం వెనుకంజలో ఉన్నట్లు తాజా రిపోర్టులు చెప్తున్నాయి. అయితే తాము ట్రెండ్స్ ను పట్టించుకోబోమని 11 గంటల తర్వాత అసలు ఫలితాలు వెల్లడవుతాయని ధీమాగా చెప్తున్నారు. కాంగ్రెస్ 130 సీట్లు సాధించడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తెలిపారు.












Click it and Unblock the Notifications