సికింద్రాబాద్ నుంచి మహా కుంభమేళాకు రైలు: ఏపీలో ఈ 8 స్టేషన్లల్లోనే హాల్ట్..!!
Secunderabad-Maha Kumbh Punya Kshetra Yatra train: తెలుగు రాష్ట్రాల్లో మరో విడత భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు ఎక్కబోతోంది. మహా కుంభ్ పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో ప్రవేశపెట్టిన ఈ రైలు గురువారం సికింద్రాబాద్ నుంచి ఉత్తర ప్రదేశ్‌లోని వారణాశి-అయోధ్య- ప్రయాగ్ రాజ్‌కు బయలుదేరి వెళ్లనుంది.
దీనికి సంబంధించిన ప్యాకేజీని ఇదివరకే ప్రకటించింది ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. దీనికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించింది. బుధవారం నాటికి 576 సీట్లు బుక్ అయ్యాయి. ఇందులో స్లీపర్- 320, 3-ఏసీ- 206, 2-ఏసీ 50 సీట్లు ఫుల్ అయ్యాయి.

దేశంలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను అనుసంధానిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ.. భారత్ గౌరవ్ పేరుతో ఈ ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్న విషయం తెలిసిందే. వీటికి ప్రయాణికుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ప్రారంభమైన అన్ని చోట్ల కూడా ప్రయాణికుల ఆదరణ భారీగా ఉంటోంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని ఐఆర్‌సీటీసీ జోన్ల వారీగా భారత్ గౌరవ్ ప్రత్యేక రైళ్లను మరింత విస్తృతపరుస్తోంది. వాటి ట్రిప్‌ల సంఖ్యనూ పెంచుతోంది. ఈ క్రమంలో సికింద్రాబాద్ నుంచి అయోధ్య, వారణాశికి మరో ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకుని వచ్చింది ఐఆర్‌సీటీసీ.
ఏడు రాత్రులు/ఎనిమిది పగళ్లు సాగుతుంది ఈ మహా కుంభ మేళా పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు .. భువనగిరి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిరతో పాటు ఏపీలోని విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లల్లో హాల్ట్ సౌకర్యం ఉంది.
ఈ ప్యాకేజీలో వారణాశిలోని కాశీ విశ్వనాథ ఆలయం- కాశీ విశాలాక్షి దేవి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. అయోధ్యలో శ్రీరామచంద్రులవారి ఆలయం, హనుమాన్ గర్హి, హారతి, అత్యంత ప్రాచీనమైన సరయూ నదిని దర్శించవచ్చు. ప్రయాగ్ రాజ్‌లో త్రివేణి సంగమం సందర్శనతో ఈ ప్యాకేజీ టూర్ ముగుస్తుంది. ప్రయాగ్ రాజ్ నుంచి మళ్లీ సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్.
ఈ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 22,635 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్. ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల్లోపు వారికి 21,740 రూపాయల ఛార్జీని నిర్ధారించారు. థర్డ్ ఏసీలో పెద్దలకు 31,145, పిల్లలకు 30,095 రూపాయలు, సెకెండ్ ఏసీ పెద్దలకు 38,195, పిల్లలకు 36,935 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications