ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకం: మాలలంటే చిన్న చూపంటూ వివేక్
మాలలు ఐక్యంగా ఉండి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మాలల సింహగర్జన సభకు ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు ముఖ్య నేతలు హాజరై ప్రసంగించారు. రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన మాలలను ఉద్దేశించి వివేక్ ప్రసంగించారు.
మాలలు కదిలితే ఏం జరుగుతుందో మనం చూపిద్దామని వివేక్ అన్నారు. అంబేద్కర్ మాల, మాదిగ అని ఆలోచించలేదని.. దళితులకు రిజర్వేషన్ ఇచ్చారన్నారు. కాకా కాలేజీలో ఎక్కడా మాల, మాదిగ అని తేడా ఉండదన్నారు. కాకా గుడిసెలు ఇచ్చినప్పుడు కూడా మాల, మాదిగ అని మాట్లాడలేదన్నారు వివేక్.

రాజకీయ పార్టీల్లో మాలలంటే చిన్న చూపు ఉందన్నారు. అలాంటి వారికి ఈ సభ చెంప పెట్టని అన్నారు. మనం ఐక్యంగా ఉంటేనే.. మనకు గౌరవం లభిస్తుందని మాలలను ఉద్దేశించి వివేక్ వ్యాఖ్యానించారు. మాలల సింహ గర్జన సభకు ఇంత జనం హాజరవుతారని ఎవరూ ఊహించలేదని సంతోషం వ్యక్తం చేశారు.
కుల వివక్ష చూసే అంబేద్కర్ రాజ్యాంగంలో మనకు రిజర్వేషన్లు కల్పించారని.. కానీ, ఇవాళ ఆ రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర జరుగుతోందన్నారు వివేక్. ముందు క్రిమిలేయర్ అంటారు.. ఆ తర్వాత రిజర్వేషన్లు ఎత్తివేస్తారన్నారు. మాలలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మాలలు అంతా ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలన్నారు.
గతంలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తే.. ఎన్నో పదవులు ఇస్తామంటూ ఆపర్లు వచ్చాయని.. వాటన్నింటినీ తృణప్రాయంగా విడిచిపెట్టానని వివేక్ చెప్పారు. మాలల కోసం పోరాటం చేస్తోన్న తనపై ఈడీ దాడులు చేసినా వెనక్కి తగ్గలేదన్నారు.
మరోవైపు, కాంగ్రెస్ సీనియర్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ.. మాలల కోసం తన కుటుంబం ఎంతో కష్టపడిందన్నారు. మాల కులాన్ని కాపాడే బాధ్యత తమపై ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఈ ఏడాది ఆగస్టు 1న తప్పుడు తీర్చి ఇచ్చిందని.. ఆ తీర్పును వ్యతిరేకించేందుకు మాలలంతా ఇక్కడికి వచ్చారన్నారు వినోద్. తక్కువ సంఖ్యలో ఉన్న మాలలు ఎక్కువ దోచుకుతింటున్నారంటూ విమర్శిస్తున్నారని.. మాలలు ఎవరిదేం దోచుకున్నారని ప్రశ్నించారు.
జనసంద్రమైన మాలల సింహగర్జన సభ
— Dr Vivek Venkatswamy (@VivekVenkatswam) December 1, 2024
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో దళితుల హక్కుల కోసం, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం, స్వాభిమానం కోసం జరిగిన ఈ మాలల సింహగర్జన సభ విజయవంతమైంది.
లక్షలాది మంది హాజరై దళితుల ఐక్యతకు తమ మద్దతు తెలిపారు.
సమాజంలో సమానత్వం మరియు సౌభ్రాతృత్వం… pic.twitter.com/U44jp4ye0u
మాలల సింహగర్జన సభకు ఢిల్లీ నుంచి వచ్చిన పాశ్వాన్ మాట్లాడుతూ.. తెలంగాణ, ఏపీలోనే కాదు.. ఢిల్లీలో కూడా వర్గీకరణపై చర్చ జరగాలన్నారు. ఢిల్లీ వరకు మాలల పోరాటం చేరితే ప్రధాని మోడీ కుర్చి కదలాలని పాశ్వాన్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై మాలలు ఉద్యమిస్తారని తేలిపోయిందన్నారు. పార్లమెంటులో మాలల గురించి చర్చ జరగాలన్నారు.












Click it and Unblock the Notifications