ముదురుతున్న వివాదం.. మరోసారి స్పందించిన మైనంపల్లి
టికెట్ల కేటాయింపుపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరోసారి స్పందించారు. సోమవారం తాను మాట్లాడిన మాటలు తన వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీ గురించి మాట్లాడలేదని స్పష్టం చేశారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ తిరిగి వెళ్లిన తర్వాత తన కార్యాచరణ ప్రణాళిక వెల్లడిస్తానన్నారు.
తనకు తన కుమారుడే ముఖ్యమని, తాను ఎవరినీ ఇబ్బంది పెట్టనని, ఒకవేళ నన్ను ఇబ్బంది పెడితే కచ్చితంగా తాను బదులిస్తానన్నారు. మల్కాజిగిరి, మెదక్ కార్యకర్తలే తనకు ప్రాధాన్యమని, ఏ పార్టీని తాను విమర్శించడంలేదన్నారు. పార్టీలకు అతీతంగా ఉంటానన్నారు. తన కుమారుడికి టికెట్ ఇస్తే కచ్చితంగా గెలిపించుకొని వస్తానన్నారు.

తనకు మల్కాజిగిరితోపాటు తన కుమారుడు రోహిత్ కు మెదక్ టికెట్ ఇస్తేనే బీఆర్ఎస్ తరఫున పోటీచేస్తానన్నారు. లేదంటే తాను స్వతంత్రంగా బరిలోకి దిగుతానని సోమవారం మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఆయన మెదక్ లో మంత్రి హరీష్ రావు పెత్తనం చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవసరమైతే తాను హరీష్ రావుపై పోటీచేస్తానన్నారు. కొవిడ్ సమయంలో తన కుమారుడు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కోట్లరూపాయలు ఖర్చుచేసి ప్రజాసేవ చేశాడన్నారు.
భారత రాష్ట్ర సమితి అధిష్టానం మైనంపల్లికి టికెట్ ఖరారు చేసినప్పటికీ అతని కుమారుడికి మాత్రం నిరాకరించింది. మెదక్ నుంచి ఉప సభాపతి పద్మా దేవేందర్ రెడ్డిని బరిలోకి దింపింది. హరీష్ రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మైనంపల్లి మరోసారి స్పందించారు.












Click it and Unblock the Notifications