కూతురుకి తెలంగాణ-ఏపీ ఇబ్బంది, హోదా: వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉంగుటూరు మండలం చేబ్రోలులో దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడంపై మనస్తాపానికి గురై ఆయన ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తోంది.
అతను బుధవారం ఉదయం తన ఒంటి పైన కిరోసిన్ పోసి నిప్పు అంటించుకున్నాడు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడంపై సన్నిహితుల వద్ద తీవ్రంగా బాధపడేవాడని తెలుస్తోంది. దీనికి తోడు తెలంగాణలో తన కుమార్తెకు ఏపీ డిఎస్సీలో అర్హత లేకపోవడంతోను కుంగిపోయాడని తెలుస్తోంది.
నలభై శాతం కాయాలతో ఉన్న దుర్గాప్రసాద్‌ను కుటుంబ సభ్యులు తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. ప్రభుత్వం డిఎస్సీ అభ్యర్థుల విషయంలో సరిగా వ్యవహరించడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తన కుమార్తెకు ఏ తెలుగు రాష్ట్రంలోనూ ఉద్యోగం రాదన్న మనస్తాపానికి కూడా ఆయన లోనయ్యారని చెబుతున్నారు. దుర్గా ప్రసాద్‌కు ఓ కుమార్తె ఉంది. ఆమె వరుసగా నాలుగేళ్లు రంగారెడ్డి జిల్లాలో చదువుకుంది. రాష్ట్ర విభజన అనంతరం నిఖిలకు స్థానికత లేదని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది.

వరుసగా నాలుగేళ్లు ఏపీలో చదవలేదన్న కారణంతో డీఎస్సీ రాసేందుకు ఏపీ నిరాకరించింది. దీంతో ప్రత్యేక హోదాతో పాటు, తన కూతురికి ఉద్యోగం రాదని మనస్తాపం చెందిన దుర్గాప్రసాద్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంజక్షన్ సైకో
పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళలపై మత్తు ఇంజక్షన్ల ప్రయోగం కలకలం సృష్టిస్తోంది. గుర్తు తెలియని దుండగుడు మత్తు ఇంజక్షన్ ఇచ్చి పరారవుతున్న ఘటనలతో మహిళలు భయాందోళనకు గురవుతున్నాయి.
బుధవారం కూడా పెనుగొండ మండలం సిద్ధాంతం, చెరుకువాడ గ్రామాల్లో ఇద్దరు మహిళలకు, వీరవాసరం మండలం బుదరాయుడు చెరువులో యువతికి, పోడూరు మండలం కవిటంలో యువతికి ఇంజక్షన్ ఇచ్చి ఆగంతకుడు పరారయ్యాడు. బాధిత మహిళలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. నాలుగు రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటనలు పెరిగిపోవడంతో మహిళలు ఒంటిరిగా బయటకు రావడానికి భయపడుతున్నారు. ఈ నెల 22న ఉండి మండలం యండగండి వద్ద విద్యార్థినులకు, నిన్న పాలకోడేరు మండలంలో ఇద్దరు విద్యార్థినులకు, ఓ మహిళా కండక్టర్‌కు, గణపవరం సమీపంలో ఓ మహిళకు ఇంజక్షన్ ప్రయోగించాడు.
ఈ ఇంజక్షన్‌లో ఎలాంటి మందు వినియోగిస్తున్నాడు? దీని వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏమిటీ? అన్న విషయమై వైద్యులు, పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు. పాలకోడేరు మండలంలో ఇంజక్షన్ ప్రయోగించిన సమయంలో ఇంజక్షన్ నీడిల్ లభ్యం కావడంతో వాటిని పరీక్షించేందుకు వైద్యాధికారులు హైదరాబాద్ ల్యాబ్‌కు పంపించారు.
దుండగుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు: జిల్లా ఎస్పీమహిళలపై ఇంజక్షన్ ప్రయోగిస్తున్న దుండగుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు. దుండగుడు వినియోగిస్తున్నది మత్తు మందు కాదని, సూది మాత్రమేనని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications