లాడ్జికి పిలిపించి.. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు.. 11మందిని ఇలా!?
బాబా తరహాలో భక్తి పేరుతో జనాలను వంచించడం ఇతగాడి నేరచరిత్ర అని పంజాగుట్ట పోలీసులు చెప్పారు.
హైదరాబాద్: బాబా తరహా మాటలతో.. పూజలు, భక్తి పేరుతో అమాయకులను బురిడీ కొట్టించడం.. ఆ తర్వాత అందినకాడికి దోచుకొని ఉడాయించడం నగరంలో నేరాలకు అలవాటుపడిన ఓ నేరస్తుడి తంతు.
గత కొన్నాళ్లుగా ఏపీ-తెలంగాణల్లో పలువురిని బురిడీ కొట్టించిన ఆ నేరస్తుడిని తాజాగా హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నేరేడు శ్రీను (36)గా గుర్తించారు. అరెస్టు అనంతరం పంజాగుట్ట పోలీసులు వివరాలు వెల్లడించారు.

నిందితుడి నుంచి రూ. 4.25 లక్షల నగదు, కేజీ 200 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. బాబా తరహాలో భక్తి పేరుతో జనాలను వంచించడం ఇతగాడి నేరచరిత్ర అని చెప్పారు. తన మాటలకు చిక్కినవారిని తక్కువ రేటుకు బంగారం ఇప్పిస్తానని మోసం చేస్తున్నాడని అన్నారు.
పలానా లాడ్జికి రావాలని వారికి ఫోన్ చేయడం.. తీరా వాళ్లు అక్కడికి వచ్చాక కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇవ్వడం.. ఆపై వారు స్పృహ కోల్పోగానే అందినకాడికి దోచుకుని ఉడాయించడం ఇతగాడి నేరాల చిట్టా అని డీసీపీ అన్నారు. ఇప్పటిదాకా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 11మంది ఇతని బారినపడి మోసపోయినట్టుగా తెలిపారు.
కాగా, నిందితుడు నేరేడు శ్రీనుపై పీడీ యాక్ట్ పెట్టాల్సిందిగా ఉన్నతాధికారులకు ప్రతిపాదన పంపినట్లు డీసీపీ తెలియజేశారు.












Click it and Unblock the Notifications