కేవలం 2 వేల రూపాయల కోసం స్నేహితుడి గొంతు కోసి హతమార్చిన కసాయి; హైదరాబాద్ లో దారుణం
స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అని చెబుతుంటారు. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా అంటూ స్నేహితుడి గొప్పతనాన్ని, స్నేహబంధం లో ఉన్న మాధుర్యాన్ని తెలియజేస్తుంటారు. సృష్టిలో అన్ని బంధాల లోనూ స్నేహబంధం ఎంతో పవిత్రమైందని అంటుంటారు. అయినా సరే స్నేహం చెయ్యటానికి కూడా సరైన వారిని ఎంచుకోవాలని చెప్తుంటారు. ఎవరితో పడితే వారితో స్నేహం ప్రమాదమే కాదు, ఒక్కో సారి ప్రాణాల మీదికి తెస్తుంది కూడా. చెడ్డ వారితో స్నేహం అత్యంత ప్రమాదకరం . అందుకు ఉదాహరణలుగా అనేక ఘటనలు నిలుస్తున్నాయి.స్నేహ బంధానికి మాయని మచ్చ తెస్తున్నారు కొందరు నేరగాళ్లు. స్నేహితుల ప్రాణాలనే పొట్టన పెట్టుకుంటున్నారు.
హైదరాబాద్ లో దారుణం .. రెండు వేల రూపాయల కోసం స్నేహితుడి హత్య
తాజాగా హైదరాబాద్ నగరంలో ముషీరాబాద్ ఫకీరు వాడలో మద్యం మత్తులో కేవలం రెండు వేల రూపాయల డబ్బుల కోసం ఓ వ్యక్తి స్నేహితుడినే హతమార్చిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 27 ఏళ్ల సోనూ అనే వ్యక్తి బ్రతుకుతెరువు కోసం ఆరేళ్ళ క్రితం హైదరాబాదు నగరానికి వచ్చాడు. ముషీరాబాద్ లో నివాసముంటూ కార్పెంటర్ గా పని చేస్తున్నాడు. అతనికి స్థానికంగా ఓ మటన్ షాప్ లో ఉండే అల్తాఫ్ ఖాన్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వారిద్దరి మధ్య స్నేహంగా మారింది.

అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇవ్వమని అడిగినందుకు దారుణం
సోను తన స్నేహితుడిగా భావించే అల్తాఫ్ ఖాన్ కు వ్యక్తిగత అవసరాల నిమిత్తం రెండు వేల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఆ అప్పును తిరిగి అల్తాఫ్ ఖాన్ సోను కు చెల్లించలేదు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇద్దరు కలిసి మద్యం సేవించిన సమయంలో సోను, అల్తాఫ్ ఖాన్ ను తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాల్సిందిగా అడిగాడు. దీంతో వారిద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. ఆ గొడవ కాస్తా తీవ్రరూపం దాల్చడంతో, తనను డబ్బులు అడిగిన సోను పై ఆగ్రహంతో ఊగిపోయిన అల్తాఫ్ ఖాన్ తన మటన్ షాప్ కు వెళ్లి మటన్ నరికే కట్టి తీసుకువచ్చాడు. డబ్బులు అడిగాడన్న కోపంలో కత్తితో సోను పై దాడి చేశాడు.
మటన్ నరికే కత్తితో స్నేహితుడి గొంతు కోసిన వ్యక్తి
ఆ కత్తితో సోను గొంతుకోసి దారుణంగా హతమార్చాడు. హత్య చేసిన అనంతరం నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. ఇక హత్య పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోను మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. స్నేహితుడుగా భావించి నమ్మి డబ్బులు ఇచ్చినందుకు, ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు సోను అనవసరంగా బలైపోయాడు. తనతో స్నేహం గా ఉంటున్న వ్యక్తిని కేవలం రెండు వేల రూపాయల డబ్బుల కోసం అత్యంత కిరాతకంగా హతమార్చి కసాయి వాడిగా మిగిలిపోయిన అల్తాఫ్ ఖాన్ కటకటాలు లెక్క పెడుతున్నాడు. అయితే ఇలాంటి హత్యలకు ప్రధానమైన కారణం మద్యం మత్తు అన్నది గుర్తించాల్సి ఉంది. గతంలోనూ కేవలం వంద రూపాయల కోసం, చేపల కూర కోసం, ఎగ్ కర్రీ కోసం ఇలా చిన్న చిన్న కారణాలకే స్నేహితులపై హత్యలకు పాల్పడిన ఘటనలు అనేకం ఉన్నాయి.












Click it and Unblock the Notifications