తెలంగాణాకూ పాకిన మందిర్-మసీదు వివాదం: ఏ మసీదు తవ్వినా శివలింగాలున్నాయన్న బండిసంజయ్ ఓవైసీకి సవాల్!!
ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిన ఉదంతం తరువాత దేశ వ్యాప్తంగా అనేక మసీదులలో దేవాలయాలు ఉన్నాయని, హిందూ పురాతన ఆలయాల ఆనవాళ్ళు ఉన్నాయని అనేక చోట్ల పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగుతున్నాయి. ఎక్కడ మసీదులు తవ్వినా శివలింగాలు బయట పడతాయని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మందిరం మసీదు వివాదం తెలంగాణ రాష్ట్రానికి పాకినట్టుగా కనిపిస్తుంది.

తెలంగాణాలోనూ ఆలయాలను కూల్చేసి వాటిపైనే మసీదుల నిర్మాణం : బండి సంజయ్
రాష్ట్రంలోని అనేక దేవాలయాలను కూల్చివేసి వాటిపై మసీదులను నిర్మించారని తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బిజెపి) చీఫ్ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో మందిర్-మసీదు వివాదం తెలంగాణ రాష్ట్రంలోనూ మొదలైనట్లుగా కనిపిస్తుంది. దుష్ట శక్తుల నుండి బిజెపి రాష్ట్రాన్ని విముక్తి చేసి "రామరాజ్యం" స్థాపిస్తుందని బండి సంజయ్ ప్రతిజ్ఞ చేశారు.

మసీదులను తవ్వితే శివలింగాలు.. తవ్వుదామా ఓవైసీ.. బండి సంజయ్ సవాల్
తెలంగాణలోని కరీంనగర్‌లో జరిగిన హిందూ ఏక్తా యాత్రను ఉద్దేశించి బండి సంజయ్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. "తెలంగాణలో ముస్లిం పాలకులు అనేక దేవాలయాలను పడగొట్టారని వాటిపై మసీదులను నిర్మించారు" అని అన్నారు. ఈ మసీదులను ఇప్పుడు తవ్వితే శివలింగాలు బయటపడే అవకాశం ఉందని బండి సంజయ్ చెప్పారు. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి తాను సవాలు విసురుతున్నానని పేర్కొన్నారు. తెలంగాణలోని మసీదులన్నీ తవ్వేద్దాం. అస్థిపంజరాలు కనిపిస్తే, మసీదులను వారికి వదిలివేస్తాము. కానీ శివలింగాలు కనిపిస్తే వాటిని స్వాధీనం చేసుకుంటాం అన్న బండి సంజయ్ దీనికి ఓవైసీ సిద్ధంగా ఉన్నాడా? అంటూ ప్రశ్నించారు.

బీజేపీ అధికారంలోకి వస్తే మదర్సాల రద్దు
దుష్ట శక్తుల నుండి బిజెపి రాష్ట్రాన్ని కాపాడుతుందని "రామరాజ్యం" స్థాపిస్తుంది అని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అంతేకాదు బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని మదర్సాలను రద్దు చేసి, మైనారిటీలకు ఇస్తున్న రిజర్వేషన్లను రద్దు చేసి, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన కులాలు, ఆర్థికంగా వెనుకబడిన కులాలకు అదనపు కోటా కల్పిస్తామని ఆయన ప్రకటించారు. దేశంలో ఎక్కడ బాంబు దాడులు జరిగిన మూలాలు తెలంగాణాలోనే ఉన్నాయని పేర్కొన్న బండి సంజయ్ మదర్సాల లోనే ఉగ్రవాద శిక్షణ కొనసాగుతుందని ఆరోపించారు.

త్వరలో రజాకార్ ఫైల్స్ చూస్తారు
అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మదర్సా లను రద్దు చేస్తామని బండి సంజయ్ ప్రకటించారు. రెండవ అధికారిక భాషగా ఉర్దూను కూడా శాశ్వతంగా తొలగిస్తామని బండి సంజయ్ వెల్లడించారు. రాష్ట్రంలోని నకిలీ లౌకిక శక్తులకు వ్యతిరేకంగా పోరాడతామని బిజెపి అధ్యక్షుడు కూడా ప్రతిజ్ఞ చేశారు. మీరు కశ్మీర్ ఫైల్స్ చూశారు. ముందు ముందు మీరు రజాకార్ ఫైల్స్ చూడబోతున్నారు అని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. 15% ముస్లిం ఓట్ల కోసం ఔరంగజేబును ఆరాధించే మతతత్వ శక్తులతో చేతులు కలుపుతున్న వారికి గుణపాఠం చెబుతాం అని బండి సంజయ్ పేర్కొన్నారు.

లవ్ జీహాదీ అంటే లాఠీ రుచి చూపిస్తాం: బండి సంజయ్
లవ్ జిహాదీ అంటే లాఠీ రుచి చూపిస్తామని, మత మార్పిడి చేస్తే మక్కెలిరగదీస్తామని బండి సంజయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. కరీంనగర్ నడిబొడ్డున ఈద్గా పోవాలన్న, వేములవాడ లో దర్గా పోవాలన్నా రామరాజ్యం రావాల్సిందేనని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసేందుకు పోరాడుతూనే ఉంటానని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణకు పట్టిన శని కాషాయం తో కడిగేస్తా అంటూ బండి సంజయ్ తేల్చి చెప్పారు. ఇక బండి సంజయ్ తాజా వ్యాఖ్యలతో మందిర్ మసీద్ వివాదం తెలంగాణాకు పాకినట్టుగా కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications