కొండగట్టు పుణ్యక్షేత్రంలో ఘోర అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం !
తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలగజేస్తున్నాయి. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అభయ హనుమాన్ విగ్రహం నుంచి ప్రధాన రహదారి వరకు వరుసగా ఉన్న బొమ్మల దుకాణాలు మంటల్లో దగ్ధమయ్యాయి. శనివారం అర్ధరాత్రి ఘటన జరగగా భారీ ఆస్తినష్టం జరిగినట్టు చెబుతున్నారు. సమ్మక్క-సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ఈ తరహా ఘటన అందరినీ షాక్ కి గురి చేస్తోంది.
అసలేం జరిగిందంటే..
అర్ధరాత్రి సుమారు 11 గంటల సమయంలో బొమ్మల దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని అంటున్నారు. ఆ తర్వాత మంటలు వేగంగా వ్యాపించడంతో మొత్తం 32 బొమ్మల దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయని వాపోతున్నారు. దీంతో కోట్లాది రూపాయల విలువైన సామగ్రి తగలబడిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఒక్కో దుకాణంలో రూ.8 లక్షల నుండి రూ.10 లక్షల వరకు స్టాక్ ఉన్నట్లు వ్యాపారులు వాపోతున్నారు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. కానీ అప్పటికే దుకాణాలు పూర్తిగా కాలిపోయినట్టు స్పష్టం చేశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం కొంత ఊరటనిచ్చే విషయం.
ఇక షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేపట్టినట్టు వివరించారు. వేలాది మంది వచ్చే సమ్మక్క-సారలమ్మ జాతర కోసం కొండగట్టు ప్రాంతం సిద్ధమవుతుండగా.. అనుకొని విధంగా ఈ అగ్ని ప్రమాదం జరగడం స్థానీకుల్లో విషాదం నింపుతోంది.












Click it and Unblock the Notifications