ఘోరం.. పట్టపగలు నడిరోడ్డుపై కన్న తండ్రిని పొడిచి చంపేశాడు!
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు నడిరోడ్డుపై తన తండ్రిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. చుట్టూ అనేక మంది ఉన్నప్పటికీ నిందితుడ్ని ఆపేందుకు ఎవరూ ప్రయత్నించకపోవడం శోచనీయం. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీపసులు, దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన ఆరెల్లి మొగిలి (45), అతని కుమారుడు సాయి కుమార్ (25) ఇద్దరూ ప్యాకర్స్ అండ్ మూవర్స్‌లో పనిచేస్తున్నారు. అయితే, మొగిలి ప్రతీరోజూ మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ చేస్తుండటంతో సాయికుమార్ తీవ్రంగా విసిగిపోయాడు. ఈ క్రమంలోనే అతడ్ని అంతమొందించాలనుకన్నాడు.

శనివారం మధ్యాహ్నం లాలాపేట నుంచి మొగిలి బస్సులో బయల్దేరగా.. అతని కుమారుడు సాయి బైక్‌పై అనుసరించాడు. ఈసీఐఎల్ బస్ టెర్మినల్ వద్ద బస్సు దిగిన తండ్రిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా పది నుంచి 15 సార్లు పొడిచాడు. దీంతో మొగిలి తీవ్రగాయాలపాలయ్యాడు.
పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ దారుణ జరగడం గమనార్హం. ఎవరూ కూడా ఈ దాడిని అడ్డుకోలేదు. పలువురు వీడియోలు తీశారు కానీ.. దాడి నుంచి బాధితుడ్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. దాడి జరిగిన కాసేపటి తర్వాత కొందరు స్థానికులు మొగిలిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ మొగిలి మృతి చెందాడు.
కాగా, మొగిలిపై సాయి కుమార్ కత్తితో దాడి చేసిన దృశ్యాలు ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మొగిలి హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు సాయి కుమార్‌ను అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాల కారణంగానే తండ్రిపై సాయికుమార్ దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications