రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కేంద్రం కుట్రలు; ఉద్యమించండి: మంత్రి ఎర్రబెల్లి పిలుపు
రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని, రాజ్యాంగ వ్యతిరేక బీజేపీపై ఉద్యమించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు అంబేద్కర్ 66 వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రంలోని అధికార బీజేపీ పై నిప్పులు చెరిగారు.
కేంద్ర ప్రభుత్వం బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి వ్యవస్థను నాశనం చేస్తుందని అన్నారు. రిజర్వేషన్లు అమలు చేయకుండా ఉండేందుకు పూనుకుందని విమర్శించారు. ఈ దేశంలో అంబేద్కర్ స్ఫూర్తిని మంత్రి కేసీఆర్ పాటిస్తున్నట్లు గా, రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్లుగా మరెవరు చేయడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక దళిత వర్గానికే కాదు సమాజంలోని అందరికీ చెందినవారని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ముఖ్యమంత్రి కెసిఆర్, మేము మంత్రులు కాగలిగాం అని పేర్కొన్నారు. దళితులకు, రైతులకు, పేదలకు, పెన్షన్లు, కళ్యాణలక్ష్మీ ఇస్తున్నామని అందరికీ అన్ని చేస్తున్నది రాజ్యాంగ స్పూర్తితోనే అని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కేసీఆర్ కు అంబేద్కర్ పట్ల అమితమైన గౌరవ భావం ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తానిచ్చిన ఉద్యోగాల హామీని విస్మరించి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. రిజర్వేషన్లను మంటగలిపే కుట్ర చేస్తోందని విమర్శించారు.
మీరంతా చైతన్యంగా ఉండి, బిజెపి చేసే కుట్రలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ పై కావాలని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో అన్ని వ్యవస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ప్రైవేటీకరణలను వ్యతిరేకిస్తూ ఉద్యమించాలన్నారు. ఉద్యమం చేస్తేనే కేంద్రం దిగి వస్తుంది అని లేకపోతే మొండిగా వెళుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా పని చేస్తున్న కేంద్రానికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.