డ్రైనేజీలను శుభ్రం చేసిన మంత్రి ఎర్రబెల్లి .. పల్లె ప్రగతిలో పనులు చేస్తూ తెలంగాణా మంత్రి హల్చల్
తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పల్లె ప్రగతి కార్యక్రమంలో హల్చల్ చేస్తున్నారు. గ్రామాలలో పర్యటిస్తూ పల్లె ప్రగతి కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొంటున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజల మన్నన పొందేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

పల్లె ప్రగతిలో ఊరూరూ తిరుగుతున్న మంత్రి ఎర్రబెల్లి
ఈ నెల 3వ తేదీ నుండి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి లో భాగంగా 3వ రోజైన 5వ తేదీ ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఊరూరా తిరుగుతూ పల్లె ప్రగతి కార్యక్రమాల్లో అత్యంత చురుగా పాల్గొంటున్నారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ.. ఉత్తేజ పరుస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తిలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి గ్రామంలో వాడవాడలా తిరిగారు. ప్రజలతో మాట్లాడుతూ, పారిశుద్ధ్యం పై అవగాహన కల్పించారు.

డ్రైనేజీలను శుభ్రం చేసిన మంత్రి
చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. అంతేకాదు గ్రామాలలో ఉన్న డ్రైనేజీ లను అట్టా మట్టి పేరుకు పోవడం చూసి వెంటనే ఆయన సఫాయి పని చేశారు. డ్రైనేజీ లను శుభ్రం చేశారు. మురుగు కాలువలో మట్టిని చెత్తాచెదారాన్ని తొలగించారు. అంతేకాదు గ్రామంలోని ప్రజలను పలకరించి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఇకపై కొడకండ్ల మండలం రేగులలో మంత్రి ఉపాధి హామీ కూలీలతో మమేకం అయ్యారు.

ఉపాధి హామీ కూలీలతో కలిసి పని చేసిన మంత్రి ..
ఉపాధిహామీ కూలీల తో కలిసి పని చేసిన మంత్రి, వారి పనితీరును, వారికి అందుతున్న కూలీని, జరుగుతున్న పనులను ఆరా తీశారు. ఇక ఉపాధి హామీ కూలీలు పెట్టిన అన్నం తింటూ వారందరిలో ఒకడిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కనిపించారు. ఇక గ్రామాలలో పర్యటిస్తున్న మంత్రి ఎర్రబెల్లి అధికారులకు పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టాల్సిన పనులపై దిశా నిర్దేశం చేస్తూ ముందుకు సాగుతున్నారు. పల్లెలలో పరిశుభ్రతకు పెద్ద పీట వెయ్యాలని సూచిస్తున్నారు.

మహబూబాబాద్ లోనూ మంత్రి ఎర్రబెల్లి పల్లె ప్రగతి బాట
అంతేకాదు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల గ్రామంలో పల్లె ప్రగతి లో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రామాల్లో తిరిగి పారిశుద్ధ్యం, స్ట్రీట్ లైట్స్, మురుగునీటి కాలువలను పరిశీలించారు. గ్రామంలో కరెంట్ తీగలు సరిగా లేకపోవడంతో వెంటనే వాటిని సరి చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్లె ప్రగతి ప్రాధాన్యాన్ని వివరించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. పల్లె ప్రగతి వల్ల జరుగుతున్న అభివృద్ధి ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పారు.












Click it and Unblock the Notifications