కేసీఆర్ ను ఎన్టీఆర్ తో పోల్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు .. ఆదర్శ ముఖ్యమంత్రి అని ఓ రేంజ్ లో ఎత్తేశారుగా !
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్ ని ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ను ఎన్టీఆర్ తో పోలుస్తూ ఆదర్శ ముఖ్యమంత్రి అంటూ కొనియాడారు. కమలాపురం మండలం ఉప్పల్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన ఎర్రబెల్లి దయాకర్ రావు పల్లెప్రగతి పనులను నిరంతర ప్రక్రియగా ప్రజలంతా భాగస్వాములై గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

రైతులకు 10వేలు ఎదురు పెట్టబడి అందించిన మహానీయుడు కేసీఆర్
తన సుదీర్ఘ జీవితం లో ఎన్టీఆర్, కేసీఆర్ లాంటి ఆదర్శ ముఖ్యమంత్రులు ఎప్పుడూ చూడలేదని పేర్కొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు భూమి శిస్తును రద్దు చేసిన నాయకుడు యన్టీఆర్ అయితే.. రైతుబంధు పథకం ప్రవేశపెట్టి ఎకరాన 10వేలు ఎదురు పెట్టబడి అందించిన మహానీయుడు కేసీఆర్ అంటూ కితాబిచ్చారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో గ్రామాలలో సమస్యలు పెరిగిపోయాయని, కానీ సీఎం కేసీఆర్ పాలనలో, కెసిఆర్ కృషితో గ్రామాలలో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.

ప్రతిపక్ష పార్టీలు అబద్ధపు మాటలతో రాజకీయ లబ్దికి యత్నాలు
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశంలోని ఆదర్శంగా నిలిచాయని ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. 24 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించిన ఘనత కూడా సీఎం కేసీఆర్ దే అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అబద్ధపు మాటలతో రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నం చేస్తున్నాయని ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్రం విఫలమైందని కేంద్రంలోని బిజెపి సర్కారుపై మండిపడ్డారు దయాకర్ రావు.

కరోనా కష్ట కాలంలోనూ సంక్షేమ ఫలాలు
కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలకు నిధులను విడుదల చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని, మిషన్ భగీరథ పథకంతో, గ్రామాలు, పట్టణాలు, నగరాలలో రక్షిత తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ఆయన పేర్కొన్నారు. ప్రతినెలా గ్రామపంచాయతీ అభివృద్ధి నిధులను విడుదల చేస్తున్నామని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి , హరితహారం కార్యక్రమాలతో గ్రామాలు పట్టణాలు అభివృద్ధిలో ముందువరుసలో ఉంటాయని ఆయన వెల్లడించారు.

వ్యవసాయానికి బాసటగా .. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజల్లో సంతోషం
మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం తో వ్యవసాయానికి బాసటగా నిలిచామని, విద్యా వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణతో సీజనల్ వ్యాధుల నివారణకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications