మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హోలీ సంబరాలు.. గిరిజన మహిళలతో కలిసి మంత్రి కోలాటం
హోలీ సంబరాలకు దేశమంతా సిద్ధమవుతోంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ హోలీ సంబరాలు అంబరాన్ని తాకేలా జరుపుకోవడానికి ఇప్పటినుంచి బోలెడన్ని ప్లాన్లు వేస్తున్నారు. అయితే హైదరాబాద్ జంట నగరాల్లో హోలీ సంబరాల పై పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ఇదిలా ఉంటే గిరిజన తండాలలో, తెలంగాణ గ్రామాలలో హోలీ సంబరాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. మహిళలు ఇప్పటికే గ్రామ గ్రామాన తిరుగుతూ జాజిరి ఆడుతున్నారు. కోలాటాలతో హోలీకి కొత్త ఉత్సాహాన్ని తెచ్చారు.

గిరిజన మహిళలతో హోలీ ఆడిన మంత్రి ఎర్రబెల్లి
తాజాగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గిరిజన లంబాడి మహిళలతో కలిసి హోలీ సంబరాల్లో భాగంగా కోలాటం ఆడారు. ప్రజలతో కలిసి పోయి, వారి జీవితాలతో మమేకమై కుటుంబ సభ్యుడి లాగా అనిపించే మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ ఎర్రబెల్లి దయాకర్ రావు మరోమారు తాను మాస్ లీడర్ అని నిరూపించుకున్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో కడవెండి పొట్టిగుట్ట శివారులోని వాన కొండయ్య శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలకు హాజరు కావడానికి వెళుతుండగా మార్గమధ్యలో లంబాడి గిరిజన మహిళలు హోలీ ఆడుతూ కనిపించారు.

మహిళలతో కలిసి మంత్రి కోలాటం
గిరిజన మహిళలను చూసిన మంత్రి తన వాహనాన్ని ఆపి వారందరినీ ఆప్యాయంగా పలకరించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని చూడగానే గిరిజన మహిళలు ఆయనకు బొట్టుపెట్టి తమతో పాటు హోలీ కోలాటం వాడాల్సింది గా విజ్ఞప్తి చేశారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారి విజ్ఞప్తి మేరకు వారితో కాసేపు కోలాటం ఆడారు. పాటలు పాడుతూ కోలాటం ఆడుతున్న మహిళలు చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు. అక్కడ ఉన్న వారందరికీ సంతోషాన్ని కలిగించేలా మంత్రి ఎర్రబెల్లి వారితో కాసేపు కలిసిపోయి హోలీ ఆటలు ఆడారు.

వానకొండయ్య లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణానికి హాజరైన మంత్రి ఎర్రబెల్లి
ఆ తర్వాత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామం హనుమాన్ దేవాలయం నుంచి తలంబ్రాలను తలకు ఎత్తుకొని పొట్టిగుట్ట తండాలో కొండమీద ఉన్న శ్రీ వానకొండయ్య లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణానికి హాజరయ్యారు. అక్కడ స్వామివారి కల్యాణానికి తలంబ్రాలు, పట్టు బట్టలు సమర్పించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వామివారిని దర్శించుకున్న మంత్రి తమ మొక్కులు తీర్చుకున్నారు.
Recommended Video

సీఎం కేసీఆర్, ప్రజలు బాగుండాలని స్వామి వారిని కోరుకున్నానన్న మంత్రి
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి తమ ఇలవేల్పు అన్నారు. వాన కొండయ్య శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో ఇలా తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం రావడం తన పూర్వ జన్మ సుకృతం అన్నారు. ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని, రాష్ట్రాన్ని బంగారు మయం చేస్తున్న సీఎం కెసీఆర్, వారి కుటుంబం చల్లగా నాలుగు కాలాల పాటు ఉండాలని ఆ స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. తన శక్తి మేరకు, వాన కొండయ్య శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం తో పాటు పాలకుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రం లో నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఆ స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని, వ్యవసాయ మంచి గా సాగాలని, రాష్ట్రం, నియోజకవర్గం పాడి పంటలతో తులతూగాలని మంత్రి కోరుకున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications