రైతులపై బీజేపీ కక్ష అందుకే;ఆ విషయం బయటపడితే బిజేపి జెండా పట్టినోళ్లను ప్రజలు ఉరికిస్తారన్న మంత్రి ఎర్రబెల్లి
వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని ధాన్యాన్ని కొనుగోలు చేయని కేంద్రం తీరుపై ఇక నుంచి పోరాటం చేస్తామని చేసిన ప్రకటనతో నేడు రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. యాసంగి లో తెలంగాణ రైతులు పండించే ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు నియోజకవర్గాలలో ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తిలో ఎడ్ల బండి ఎక్కి కేంద్రంపై తన నిరసనను తెలియజేశారు.

కేంద్రం దిగి వచ్చి వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం ఆగదు
ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపర్తి, వర్ధన్నపేట, హనుమకొండ, పాలకుర్తి ధర్నాలలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ రైతాంగంపై కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. కక్షపూరితంగా కావాలనే కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తున్నామని తెలిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రం దిగి వచ్చి వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతులు ధాన్యం కొనుగోలు చేయకపోతే, తెలంగాణ రైతుల ఉసురు కేంద్ర ప్రభుత్వానికి తగులుతుందని ఎర్రబెల్లి దయాకర్ రావు శాపనార్థాలు పెట్టారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ ధర్నాలలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి
రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ, ప్రజలంతా రైతాంగానికి అండగా నిలవాలని ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర రైతుల యాసంగి పంటలను కొనుగోలు చేసే వరకు ఆందోళనలు ఆపొద్దు అని ఆయన పేర్కొన్నారు. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తిలో స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నేతలతో కలిసి మంత్రి చౌరస్తాలో ధర్నా చేశారు. ఆ తర్వాత వర్ధన్నపేటలో ఎమ్మెల్సీ, రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అరూరీ రమేశ్, వరంగల్ ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నే ని రవీందర్ రావు, తదితరులతో కలిసి రైతుల ధర్నా లో పాల్గొన్నారు. ఆ తర్వాత హనుమకొండ జిల్లాలోని వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఆచార్య జయశంకర్ ఏకశిలా పార్క్ లో పెద్ద ఎత్తున నిర్వహించిన ధర్నాలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి ఆందోళనలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు.

సమైక్య రాష్ట్రంలో పరిస్థితి గుర్తు చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు
సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగం అభివృద్దికి తెలంగాణ సీఎం కేసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అభివృద్ది, సియం కేసిఆర్ ఆద్వర్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్దిని అందరూ ఒకసారి విశ్లేషించుకోవాలని సూచించిన మంత్రి ఎర్రబెల్లి నాటి పాలకుల నిర్లక్ష్యంతో బాబ్లీ వంటి ప్రాజెక్ట్ ల నిర్మాణంతో ప్రధాన వనరుగా ఉన్న ఎస్సారెస్పీకి చుక్కనీరు రాకుండా పోయిందని గుర్తు చేశారు. కాకతీయ కాలువ శిథిలావస్థకు చేరిందని, ఉత్తర తెలంగాణకు సాగునీరు కరువైందని అలాంటి పరిస్థితుల నుండి ప్రస్తుతం సమృద్ధిగా పంటలు పండించుకునే పరిస్థితికి వచ్చామని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించినందుకే తెలంగాణాపై కక్ష
తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్రం వివక్ష చూపిస్తుందని మండిపడిన మంత్రి ఎర్రబెల్లి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల కోసం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించినందుకే తెలంగాణ పై బిజేపి కక్ష కట్టిందని వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు, రైతులకు శాపాలుగా మారతాయని ఆయన పేర్కొన్నారు. బిజేపి నాయకులకు దమ్ముంటే మీరు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాల్లోని మతలబు వివరించి చెప్పాలన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాలని ధర్నాలు చేయగలరా? మీరు తెచ్చిన చట్టాలలో ఉన్న విషయం బయటపడిన రోజు బిజేపి జెండా పట్టినోళ్లను ప్రజలు ఉరికిస్తారు అంటూ మంత్రి ఎర్రబెల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఒకవైపు ధాన్యం కొనలేమని చెప్తూ మరోవైపు వరి వెయ్యాలని డ్రామాలా?
ఓ వైపు ఎఫ్.సి.ఐ ధాన్యం కొనేది లేదని రాష్ట్రానికి నోటీసులు జారీ చేస్తూ మరోవైపు రైతులను యాసంగిలో వరి వేయాలని బిజెపి నేతలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం నుంచి వరిధాన్యం కొంటామని లేఖ తీసుకొచ్చి.. రైతులను ప్రొత్సహించండి తప్ప.. రైతులను ఆగం చేయకండని ఎర్రబెల్లి దయాకర్ రావు బిజెపి నాయకులకు హితవు పలికారు. పంజాబ్ లో పండే ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందని మన తెలంగాణలో పండించిన ధాన్యాన్ని ఎందుకు కొనరు అంటూ నిలదీశారు. తెలంగాణ రైతులు రైతులు కాదా? ఇది పంట కాదా? ఈ వివక్ష దేనికీ అంటూ ప్రశ్నించారు ఎర్రబెల్లి దయాకర్ రావు.
Recommended Video

బీజేపీ సర్కార్ తీరుపై మంత్రి ఎర్రబెల్లి ధ్వజం
కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాల వల్ల కార్పొరేట్ సంస్థల వద్ద రైతులను కూలీలుగా మార్చేందుకు బిజెపి కుట్రలు చేస్తుంది అని మండిపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినా.. దేశంలో వినియోగదారులపై సెస్ రూపేణా దోచుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు రావాల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు సెస్ పేరుతో మోసం చేస్తున్నదని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. కొండంత పెంచి.. పిసరంత తగ్గించిందని ఆరోపించారు. పెట్రోల్, డిజిల్ ధరల పెరుగుదలతో నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల జీవితాలు ఆగమవుతున్నాయని మండిపడ్డారు. కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం అంబానీ, అదానీల కోసం దేశాన్ని దోచిపెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications