కేసీఆర్ కుటుంబంపై ఈగ కూడా వాలనివ్వం; కవిత జోలికొస్తే ఖబడ్దార్: మంత్రి ఎర్రబెల్లి వార్నింగ్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఉన్నారని బిజెపి నేతలు చేసిన విమర్శలతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయాలు అట్టుడికిపోయాయి. బిజెపి నాయకులు కవితని టార్గెట్ చేస్తూ పదవికి రాజీనామా చేయాలని ఆందోళన బాట పడితే, బిజెపిని టార్గెట్ చేస్తూ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కవితకు మద్దతుగా నిలిచి కేంద్ర సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది.

మచ్చలేని కేసీఆర్ కుటుంబంపై బీజేపీ విషం చిమ్ముతోంది: మంత్రి ఎర్రబెల్లి
ఇప్పటికే కవితకు మద్దతుగా తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు స్పందించగా తాజాగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తనదైన శైలిలో బిజెపి పై విరుచుకుపడ్డారు. కెసిఆర్ కుటుంబం పై ఈగను కూడా వాలనివ్వమని, కేసీఆర్ వెంటే మొత్తం తెలంగాణ ప్రజానీకం ఉందని, రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన ఆ కుటుంబం కోసం ఏ త్యాగానికైనా పార్టీ మొత్తం సిద్ధంగా ఉందని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. మచ్చలేని కేసీఆర్ కుటుంబం పై బిజెపి విషం చిమ్ముతోంది అని మండిపడ్డారు.

కవిత కుటుంబానికి ఉమ్మడి వరంగల్ జిల్లా సంఘీభావం
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగనివ్వం అని పేర్కొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు కల్వకుంట్ల కవిత కుటుంబానికి మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా సంఘీభావంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంపై బిజెపి వ్యవహారం గర్హనీయమని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బండి సంజయ్ పాదయాత్ర దేనికోసం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం ఏమీ చెయ్యలేని బండి సంజయ్ గూండాలను వెంటేసుకుని బజార్లు తిరుగుతున్నారని మండిపడ్డారు .

కేసీఆర్ కుటుంబం జోలికొస్తే ఖబడ్దార్
కెసిఆర్ రైతు వ్యతిరేకి అన్న అమిత్ షాది తెలివితక్కువతనం అని పేర్కొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు, రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటూ గుర్తు చేశారు. మునుగోడు లో బిజెపికి మిగిలేది గోడే అని మునుగోడు ఉపఎన్నికలలో బిజెపి ఓటమి ఖాయమని ఎర్రబెల్లి దయాకర్ రావు తేల్చిచెప్పారు. ఎవరైనా సరే కేసీఆర్ కుటుంబం జోలికొస్తే ఖబడ్దార్ అంటూ ఎర్రబెల్లి దయాకర్ హెచ్చరించారు. కవిత కు సంబంధం లేని విషయంలో లిక్కర్ బురద జల్లుతున్నారని, ఎమ్మెల్సీ కవితను కేసులో ఇరికించారని ప్రయత్నం చేస్తున్నారని, కవిత జోలికి వస్తే తెలంగాణ రాష్ట్రం యావత్తు కన్నెర్ర చేస్తుందంటూ మండిపడ్డారు.

చట్టం ఎవరికీ చుట్టం కాదు బండి సంజయ్: మండిపడిన ఎర్రబెల్లి
బిజెపి కార్యకర్తల పేరుతో గూండాలను ఆమె ఇంటి మీదకి హత్యాయత్నానికి పంపించారని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. దేవరుప్పుల లో బండి సంజయ్ బౌన్సర్లు, గుండాలు టిఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేశారని అయినా ఓపిక పట్టామని, ఇప్పుడు జనగామ జిల్లాలో విధ్వంసం సృష్టించడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుట్రపన్నారని, పోలీసులను కూడా బండి సంజయ్ బెదిరించారని పేర్కొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు చట్టం ఎవరికీ చుట్టం కాదంటూ స్పష్టం చేశారు.

చేతగాని చవటలు, దద్దమ్మలు అంటూ బీజేపీ నాయకులను టార్గెట్ చేసిన మంత్రి ఎర్రబెల్లి
బీజేపీ చిల్లర రాజకీయాలు, విషపూరిత విద్వేష రాజకీయాలు చేస్తోందంటూ మండిపడ్డారు. దేశంలో మోడీ, అమిత్ షా అరాచకాలకు హద్దులేకుండా పోయిందని, ప్రశ్నించినందుకే కెసిఆర్ కుటుంబం పై దాడికి దిగుతున్నారని ఆరోపించారు. అమిత్ షా బూట్లు మోసి బండి సంజయ్ బానిస సంజయ్ అయ్యారని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని మండిపడ్డారు. చేతగాని చవటలు, దద్దమ్మలు అంటూ విరుచుకుపడ్డారు. లేక లేక గోసి పెట్టినమ్మ లేసి లేసి ఎగిరింది అన్నట్టుగా బిజెపి నేతలు ఎగురుతున్నారని, దేశంలో ఎక్కడ ఎలా ఉందో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రంలో వారి పప్పులు ఉడకవు అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications