రైతులపైకి కార్లు ఎక్కించి చంపిన చరిత్ర బీజేపీది; వాళ్ళను తరిమికొట్టండని మంత్రి హరీష్ రావు పిలుపు
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరుకు నిరసనగా టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ చావు డప్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ, మండలాల్లోనూ ధాన్యం కొనుగోలు చేయని కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ర్యాలీలు తీస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు. బీజేపీ సర్కార్ కు చరమగీతం పాడాలని పిలుపునిస్తున్నారు.

రాష్ట్రంలో బీజేపీ ఆటలిక చెల్లవన్న మంత్రి హరీష్ రావు
ఇక తాజాగా సిద్ధిపేట జిల్లాలో గజ్వేల్ ఇందిరాపార్కు వద్ద ధర్నాలో పాల్గొన్న ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు బిజెపి తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అబద్ధపు పునాదులపై బిజెపి లబ్ధి పొందాలనుకుంటుందని ఆయన ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం గద్దె దిగితేనే రైతులకు మేలు జరుగుతుందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఆటలిక చెల్లవని పేర్కొన్న హరీష్ రావు దేశంలో మూడు రకాల ప్రభుత్వాలు ఉన్నాయని, ఒకటి కేంద్ర ప్రభుత్వం, రెండు రాష్ట్ర ప్రభుత్వం అని మూడవది స్థానిక సంస్థలు అని పేర్కొన్న ఆయన అందులో ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేయడం లేదని ఆక్షేపించారు. మిగతా రెండూ సమర్ధంగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు.

కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో ధాన్యం కొనుగోలు చేయించాలని డిమాండ్
రైతులు ఆందోళన చేస్తే కారు ఎక్కించి చంపిన చరిత్ర బీజేపీ ప్రభుత్వానిదని మంత్రి హరీష్ రావు ఘాటుగా వ్యాఖ్యానించారు. బిజెపి రైతు వ్యతిరేక పార్టీ అని, కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తుందని హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీపై పోరాటానికి ఇది ప్రారంభం మాత్రమేనని మంత్రి హరీష్ రావ్ తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అసత్య ప్రచారాలు చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో ధాన్యం కొనుగోలు చేయించాలని తెలంగాణా మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను వివరిస్తూ టిఆర్ఎస్ నాయకులు గ్రామగ్రామాన నిరసన కార్యక్రమాలను ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు హరీష్ రావు.

బీజేపీ నేతలను రైతులు తరిమికొట్టాలి
అబద్ధపు ప్రచారాలు చేస్తున్న బిజెపి నాయకులను రైతులు, కార్యకర్తలు తరిమికొట్టాలని హరీష్ రావు స్పష్టం చేశారు. బిజెపి దిగిపోతే రైతులు బాగుపడతారని అభిప్రాయం వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ ధరలు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అన్న ఆయన , రైతు సంక్షేమం బీజేపీ చరిత్రలో లేదని హరీష్ రావ్ తేల్చిచెప్పారు.
Recommended Video

రైతుల ఉసురు పోసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, రైతుల ఉసురు పోసుకుంటున్నదని హరీష్ రావు ఆక్షేపించారు. రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన ప్రభుత్వం , రైతుల పక్షాన పోరాటం చేసే ప్రభుత్వం కూడా కెసిఆర్ ప్రభుత్వమేనని హరీష్ రావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేదాకా, తెలంగాణ రైతుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే దాకా బిజెపి సర్కార్ పై పోరాటం ఆగదని హరీష్ రావు స్పష్టం చేశారు. ఆందోళనలను ఉధృతం చేసి రాష్ట్ర బీజేపీ నాయకులపై, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు.












Click it and Unblock the Notifications