కుటుంబనియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటన: వైద్యుల లైసెన్స్ రద్దు, మంత్రి హరీష్ రావు ఏమన్నారంటే!!
రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న బాధితులలో నలుగురు మృతి చెందిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు స్పందించారు. ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న బాధితులను పరామర్శించిన మంత్రి హరీష్ రావు ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

బాధ్యులైన వైద్యుల లైసెన్స్ రద్దు, సూపరింటెండెంట్ సస్పెండ్
నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. వారికి అందుతున్న వైద్యం గురించి వైద్య అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఇబ్రహీంపట్నం క్యాంపు ఆపరేషన్ చేసుకున్న వారిలో నలుగురు మహిళలు మృత్యువాత పడగా ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం ఇప్పటికే ఘటనకు సంబంధించి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ ఘటనకు బాధ్యులైన వైద్యులపై డాక్టర్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటుగా, హాస్పిటల్ సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేసినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

గత ఆరేళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదన్న మంత్రి హరీష్ రావు
గత ఆరేళ్లలో గత ఆరేళ్లలో 12 లక్షల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశామని కానీ ఎటువంటి సమస్య రాలేదని పేర్కొన్న మంత్రి హరీష్ రావు ఆపరేషన్లు చేసుకున్న 30 మంది మహిళలు క్షేమంగా ఉన్నారని, ఇవ్వాళ కొంతమందిని, రేపు కొంతమంది వైద్యులు డిశ్చార్జ్ చేస్తారని తెలిపారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిల్ కావడంపై నివేదిక కోరామని, త్వరితగతిన నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కాగా ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయి సుమోటోగా స్వీకరించింది. అక్టోబర్ 10 వరకు పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు నోటీసులు జారీ చేసింది.

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మృతి
ఇబ్రహీంపట్నంలో చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి ఈనెల 28వ తేదీన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ఒక మహిళ చనిపోయింది. ఆ తర్వాత ఈ నెల 29వ తేదీన మరో మహిళ ,30 వ తేదీన ఇద్దరు మృత్యువాత పడటం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురికి ఒక్కసారిగా రక్తపోటు పడిపోయింది. దీంతో 28వ తేదీన ఒకరు, 29వ తేదీన ఒకరు, 30వ తేదీన ఇద్దరు మృతి చెందారు.

దర్యాప్తుకు ఆదేశించిన ప్రభుత్వం
ఇక మృతుల కుటుంబ సభ్యుల ఆందోళనలతో మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. అంతేకాదు వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని పూర్తిస్థాయి విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది.ఈ ఘటనపై ఎక్స్పర్ట్ కమిటీ వేసి దర్యాప్తు చేస్తుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు విచారణాధికారిగా నియమించి వారం రోజుల్లోగా ఈ ఘటనకు సంబంధించిన నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలోనే మంత్రి హరీష్ రావు బాధితులను పరామర్శించారు.












Click it and Unblock the Notifications