ఎమ్మెల్యే నోరు పెద్దదిగా చేసుకొని మాట్లాడుతున్నారు: మంత్రి జగదీశ్ రెడ్డి
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తల్లి పాలు తప్ప మిగతా అన్నింటిమీద పన్నులు వేశారంటూ తెలంగాణ విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన ''పనుల ప్రధానమంత్రి'' కాదని ''పన్నుల ప్రధానమంత్రి'' అని విమర్శించారు. మంత్రి సమక్షంలో మునుగోడుకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రసమితిలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఇక్కడి ఎమ్మెల్యే ఆరునెలలకు ఒకసారి కూడా నియోజకవర్గానికి వచ్చింది లేదని, ఢిల్లీలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీకి దిక్కులేదని, ఇక నియోజకవర్గంలో ఆ పార్టీ పరిస్థితి మీ అందరికీ తెలుసన్నారు.
2018 నుంచి మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లోరోసిస్ ను తరిమివేశారన్నారు. మునుగోడు నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక దృష్టి ఉందని, ఇక్కడి సమస్యలను అందరం కలిసి పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు.
వ్యాపారాలు, కాంట్రాక్టుల్లో బిజీగా ఉండటంవల్ల ఇక్కడి ఎమ్మెల్యేకు కల్యాణలక్ష్మి చెక్కులను పంచడానికి కూడా తీరిక లేదని, అందుకే తాను ఇక్కడికి రావాల్సి వచ్చిందని, చెక్కులు పంచాల్సి వచ్చిందన్నారు. నోటికొచ్చినట్లుగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని, గత ఎన్నికల్లో అంతర్గత పోరువల్ల ఈ నియోజకవర్గాన్ని కోల్పోవాల్సి వచ్చిందన్నారు. పార్టీలో ఉన్న నాయకుల్ని దూషిస్తూ, అవతలి పార్టీ నాయకులను పొగిడే ఎమ్మెల్యే దగ్గర ఉండలేకే అందరూ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నారని మత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.

కేంద్ర మంత్రి అమిత్ షాను కలవడంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాను ఆ పార్టీలో చేరడంలేదంటూ వస్తున్న వార్తలను తాజాగా కోమటిరెడ్డి కొట్టిపారేశారు.












Click it and Unblock the Notifications