నా సోదరి కవిత బెస్ట్ అన్నారు: యోగి ఆదిత్యనాథ్‌పై కేటీఆర్ ఆసక్తికరం
ఆర్మూర్: పార్లమెంటులో అద్భుతంగా ప్రసంగించే అయిదుగురిలో తన సోదరి కవిత ఉన్నారని ఓ ఢిల్లీ నాయకులు చెప్పారని కేటీఆర్ చెప్పారు. ఇందుకు తన తండ్రి కేసీఆర్‌ను మెచ్చుకున్నారన్నారు. తమకు తర్ఫీదును ఇచ్చింది తెలంగాణ ఉద్యమం అన్నారు. అప్పట్లో తెలంగాణ వద్దని చాలామంది భయపెట్టారన్నారు.
ఆర్మూర్‌లో జనహిత ప్రగతి సభలో కేటీఆర్ మాట్లాడారు. తన సోదరి కవిత పిల్లలు, తన పిల్లలు ఏ సన్న బియ్యంతో అన్నం తింటున్నారో అదే బియ్యంతో పేదింటి పిల్లలు భోజనం తింటున్నారని కేటీఆర్ చెప్పారు.
యూపీ సీఎం యోగి..
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా మన దారిలోనే రైతు రుణమాఫీ ఇస్తామని చెప్పారన్నారు. అంత పెద్ద యూపీలో కేవలం రూ.36వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నారన్నారు.

అయిదో వంతు ఉన్న తెలంగాణలో మాత్రం రుణమాఫీ చేస్తున్నామన్నారు. యూపీలో రూ.36వేల కోట్లు ఒకేసారి మాఫీ చేయాలా, దఫాలుగా చేయాలా అని ఆలోచిస్తున్నారన్నారు.
పెద్ద రాష్ట్రమైన యూపి, కొత్త సీఎం ఆదిత్యనాథ్ తెలంగాణను ఫాలో అవుతున్నారన్నారు. మనం ఇక్కడ షి టీమ్స్ ఏర్పాటు చేస్తే అక్కడ యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేశారన్నారు. మనం రుణమాఫీ చేస్తే, వాళ్లు అక్కడ రుణమాఫీ అన్నారని చెప్పారు.
2019 వరకల్లా ఇంటికో నల్లా ఇవ్వకుంటే తాను ఓటు అడగనని కేసీఆర్ చెప్పారన్నారు. తాను ఇచ్చిన హామీని నెరవేర్చకుంటే ఓటు వేయవద్దని చెప్పగల దమ్మున్న నేత దేశంలో కేసీఆర్ మాత్రమే అన్నారు.
నిన్నటి దాకా మన దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించింది ఎక్కువగా కాంగ్రెస్ పార్టీయే అన్నారు. దేశంలో ఇలాంటి పరిస్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణన్నారు. రాష్ట్రంలోని ఇబ్బందులకు 33 నెలల కేసీఆర్ పాలన కారణమా, లేక దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ కారణమా అని నిలదీశారు.
ప్రాజెక్టులు కట్టవద్దని కోర్టులో కేసులు వేస్తున్నారన్నారు. అమ్మ పెట్టదు, తిననీయదు అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ తీరు ఉందన్నారు. ఈ దేశంలోని దరిద్రానికి కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఉండనీయవద్దన్నారు. పంతంజలి వంటి పరిశ్రమను కూడా ఆర్మూర్ తీసుకువస్తామన్నారు.












Click it and Unblock the Notifications