ఎన్నికల బిజీ షెడ్యూల్ లోనూ నాటుకోడి కూర వండిన మంత్రి కేటీఆర్.. వీడియో ఇదిగో!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి అధికార ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. క్షణం కూడా తీరిక లేకుండా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు అభ్యర్థులు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్న మంత్రి కేటీఆర్ ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తూనే, తాజాగా నాటుకోడి కూర వండి హల్ చల్ చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మై విలేజ్ షో బృందంతో కలిసి నాటుకోడి కూర వండారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడి పల్లి గ్రామానికి చెందిన మై విలేజ్ షో బృందం సభ్యులు అంజి, గంగవ్వ, అనిల్, చందు తో కలిసి హైదరాబాదులో శివారులో నాటుకోడి కూర వండి భోజనం చేశారు మంత్రి కేటీఆర్.

ఈ సందర్భంగా ఆయన బృంద సభ్యులతో అనేక అంశాలపై చర్చించారు. లంబాడి పల్లె గ్రామం గురించి తెలుసుకున్న కేటీఆర్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. లంబాడి పల్లి గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా మార్చడంతో పాటు రహదారుల అభివృద్ధికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఇక సామాన్య మహిళగా గంగవ్వ సాగించిన ప్రస్తానాన్ని కొనియాడిన కేటీఆర్ గంగవ్వ జీవిత కథ గురించి తెలుసుకొని ఆమెను ప్రశంసించారు.
గంగవ్వ తో ఎవరు పోటీ పడలేరు అని ఒకవేళ అలా పోటీ పడాలి అంటే మంత్రి మల్లారెడ్డి ఒక్కరి వల్లనే అవుతుందంటూ ఆయన చమత్కరించారు. అంతేకాదు కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నామని పేర్కొన్న మంత్రి కేటీఆర్, రైతులంతా సన్న బియ్యాన్ని పండించడానికి ముందుకు రావాలని సూచించారు. అంత బిజీ షెడ్యూల్లో కూడా మంత్రి కేటీఆర్ నాటుకోడి కూర వండి ప్రశాంతంగా ఉన్న తీరు రాజకీయ నాయకులు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.












Click it and Unblock the Notifications