ఆత్మనిర్భర్‌తో ఒరిగింది శూన్యం... తెలంగాణకు పైసా రాలే... కేంద్రమే చట్టాన్ని తుంగలో తొక్కింది : కేటీఆర్
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న కేంద్రం... ఆ చట్టాన్ని తుంగలో తొక్కిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇప్పటివరకూ కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క పైసా రాలేదన్నారు. ఇప్పటికే చాలాసార్లు కేంద్రానికి నివేదికలు కూడా ఇచ్చినప్పటికీ అటువైపు నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ ప్యాకేజీతోనూ రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని అన్నారు. రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైందో ఎక్కడ పోయిందో ఎవరికీ తెలియదన్నారు. మంగళవారం(మార్చి 23) అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

ఆత్మనిర్భర్‌తో వచ్చిందేమీ లేదు...: కేటీఆర్
గత ఆర్నెళ్లుగా వివిధ సందర్బాల్లో చిన్న,మధ్య తరహా పారిశ్రామికవేత్తలను కలిసినప్పుడు ఆత్మనిర్భర్ ప్యాకేజీ గురించి ఆరా తీసినట్లు కేటీఆర్ తెలిపారు. ఆ ప్యాకేజీ కింద ఎవరికీ ఒక్క పైసా అందలేదన్నారు. కేవలం కొంతమంది చిరు వ్యాపారులకు మాత్రమే రూ.10,000 చొప్పున రుణాలు ఇచ్చారని తెలిపారు. ఆత్మనిర్భర్ ప్యాకేజీతో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. పారిశ్రామిక రాయితీల విషయంలో కేంద్రం చేసిన చట్టాల పట్ల కేంద్రానికే పట్టింపు లేకుండా పోయిందన్నారు.

టీఎస్ ఐపాస్‌తో రూ.2.13లక్షల కోట్ల పెట్టుబడులు...
తెలంగాణలో గడిచిన ఆరేళ్లలో టీఎస్ ఐపాస్ ద్వారా రూ.2.13లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించినట్లు కేటీ వెల్లడించారు. పారిశ్రామిక వికేంద్రీకరణలో భాగంగా హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లోనూ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో స్థానికంగా పండే పంటలకు అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంతో ఇప్పటికే ఆ దిశగా... రూట్ మ్యాప్ రూపొందించామని అన్నారు.రాష్ట్రంలో రైతు బంధు సమితుల ద్వారా రైతన్నలను సంఘటితం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు...
సంబంధిత జిల్లా కలెక్టర్లు స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను ఇప్పటికే గుర్తించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై నివేదికలు ఇంకా అందాల్సి ఉంది. నర్సంపేటలోని 46 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా ఫుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించిన భూసేకరణ విషయంలో కొంత జాప్యం జరుగుతోందన్నారు. ఇక గొర్రెల యూనిట్ల పంపిణీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో మాంసాన్ని బ్రాండింగ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. గొర్రెల పంపిణీ ద్వారా రాష్ట్రంలో రూ.5వేల కోట్లకు పైగా సంపద సృష్టించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో చేపట్టిన కార్యక్రమంతో రాష్ట్రంలోని పల్లెలు ఆర్థికంగా పురోగమిస్తున్నాయని తెలిపారు.