చదువు కాగానే జాబ్స్, ఫిబ్రవరి 19 వరంగల్ దశ తిరిగిన రోజు: కెటిఆర్
వరంగల్: ఓరుగల్లు యువత చదువు పూర్తైన తెల్లారే ఉద్యోగాలు వచ్చేలా తాము ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి కెటి రామారావు శుక్రవారం అన్నారు. ఆయన వరంగల్ నగరంలో ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభించారు. అలాగే మడికొండలో ఇన్ఫోటెక్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ముఖ్యమంత్రికి వరంగల్ అంటే అఫారమైన ప్రేమ అన్నారు. ఇక్కడి యువత ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా చూస్తామన్నారు. వరంగల్ నగర ప్రజలు ఉద్యోగాల కోసం పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరం లేదన్నారు.

ప్రముఖ ఐటీ కంపెనీలను వరంగల్ తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. వరంగల్ యువతీ, యువకులకు ఐటీ రంగం పట్ల పూర్తి అవగాహన కల్పిస్తామన్నారు. మానవ వనరులు అపారంగా ఉన్న నగరం వరంగల్ అన్నారు.
వరంగల్ నగరంలో రాబోయే 18 నెలల్లో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. వరంగల్‌లోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అలాగే అమెరికా, ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి ఫాస్ట్ పేరుతో విద్యార్థులకు శిక్షణ ఇస్తామని చెప్పారు.

చదువు పూర్తయిన తెల్లారే మీకు ఉద్యోగాలు వచ్చేలా చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. క్యాంపస్ ఉద్యోగాలలో మీకు ఉద్యోగాలు పెరుగుతాయని చెప్పారు. ఒక్క హైదరాబాదులోనే సెయింట్ సంస్థ ఏడువేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్నారు.

ఐటీ రంగంలో సెయింట్ దిగ్గజ సంస్థ అన్నారు. అలాంటి సంస్థఇక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. నెల రోజుల్లోనే సెయింట్ ఇన్ఫోటెక్‌ను అందుబాటులోకి తీసుకు రానుందన్నారు. వరంగల్ ఎన్‌ఐటిలోను ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. వరంగల్ నగరం గతంలో కొంత వెనుకబాటుకు గురైందన్నారు.

విభజన జరిగితే హైదరాబాదులో ఐటీ ఏమో అవుతుందని భయపెట్టారని, కానీ ఇప్పుడు బ్రహ్మాండంగా ఉందన్నారు. ప్రముఖ ఐటీ కంపెనీలను మేం వరంగల్ తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి 19న వరంగల్ ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారని, ఈ రోజు వరంగల్ దశ తిరిగిన రోజు అని, వరంగల్ నగరంలో ఐటీ అడుగు పెట్టిన రోజు అన్నారు.












Click it and Unblock the Notifications