వైజాగ్ స్టీల్ ప్లాంట్ మద్దతుగా కేటీఆర్ - కీలక నిర్ణయం..!!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన కేంద్రానికి లేఖ రాసారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించే కుట్రలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోందని మండిపడ్డారు.
ప్రయివేటీకరణ ప్రయత్నాలను కార్మికులు అడ్డుకుంటున్న వేళ కేంద్రం దొడ్డిదారిన ప్రైవేటుకు కట్టబెట్టే కుతంత్రానికి తెరలేపిందని పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని కేటీఆర్ స్పష్టం చేసారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావం తెలపాలని ఏపీ బీఆర్ఎస్ నేతలకు సూచించారు.

మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ రాసారు. తన లేఖలో కేంద్రం స్టీల్ ప్లాంట్ విషయంలో అనుసరిస్తున్న తీరును తప్పు బట్టారు. మౌలిక వసతుల ప్రాజెక్టులకు అత్యంత కీలకమైన స్టీల్ ఉత్పత్తిని పూర్తిగా ప్రైవేటుపరం చేయాలని చూడడం కేంద్ర ప్రభుత్వ నిబద్ధత లోపాన్ని తేటతెల్లం చేస్తుందని స్పష్టంచేశారు.
స్టీల్ ఉత్పత్తి రంగాన్ని నాన్ స్ట్రాటజిక్ రంగంలోకి మార్చడంలోనే కేంద్ర ప్రభుత్వం కుట్ర దాగి ఉందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను పూర్తిగా ప్రైవేటుపరం చేసే ముందు, దాన్ని నష్టాల పాలు చేసి వాటిని సాకుగా చూపించి లక్షల కోట్ల విలువైన ఆస్తులను అప్పనంగా ప్రైవేట్ కార్పొరేట్ మిత్రులకు అప్పజెప్పేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని ఆరోపించారు.
కేంద్రం ఉద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తోంది
స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన ప్రత్యేక ఐరన్ వోర్ గనులను కేటాయించకుండా కేంద్రం మోకాలడ్డిందని కేటీఆర్ పేర్కొన్నారు. దీంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ తన ఉత్పత్తి ఖర్చులో 60% వరకు పూర్తిగా ముడి సరుకు పైనే ఖర్చు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు ప్రైవేట్ కంపెనీలకు ఇబ్బడిముబ్బడిగా ఐరన్ వోర్, బొగ్గు, ఇతర గనులను కేటాయించడం వల్ల వారి ఉత్పత్తిలో ముడి సరుకుల ఖర్చు కేవలం 40% లోపలనే ఉన్నదని చెప్పారు.
పెద్ద ఎత్తున ముడి సరుకు పైనే ఖర్చు చేయాల్సి రావడంతో.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మార్కెట్లో ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలతో ఉత్పత్తి విషయంలో పోటీపడటంలో కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని విశ్లేషించారు. మార్కెట్లో వాటితో సమాన ధరకు అమ్మాల్సి రావడంతో నష్టాలను ఎదుర్కొంటుందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను అంతిమంగా నష్టాల్లోకి నెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తుందని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ అండగా నిలుస్తోంది
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి 7.3 ఎంటిపిఏ కెపాసిటీ ఉన్నా.. కేవలం ముడి సరుకును, మూలధనాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల పూర్తిస్థాయి కెపాసిటీతో పనిచేయలేకపోతోందని తెలిపారు. ప్రస్తుతం పని చేస్తున్న 50 శాతం కెపాసిటికి కూడా 100 శాతం కెపాసిటి ఉత్పత్తికి అయ్యే ఖర్చే అవుతుందని మంత్రి చెప్పారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తే 100% కెపాసిటీతో పని చేయడం వల్ల అనేక ఖర్చులు కలిసి వచ్చి స్టీల్ ప్లాంట్ లాభాల బాట పడుతుందని స్పష్టంచేశారు.
ఇప్పటికైనా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు వర్కింగ్ క్యాపిటల్ పేరుతో ప్రైవేట్ కంపెనీలతో కలిపే ప్రయత్నాన్ని పూర్తిగా విరమించుకోవాలని సూచించారు. దీని బదులు కేంద్ర ప్రభుత్వమే అందుబాటులో ఉన్న ఇతర మార్గాల ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను బలోపేతం చేయాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications