నిర్మలా సీతారామన్ కరెన్సీనోట్లపై మోడీ ఫోటోను ముద్రించాలని ఆదేశిస్తారేమో.. మంత్రి కేటీఆర్ సెటైర్లు!!
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. కేంద్రంలోని అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ తెలంగాణ మంత్రులు నేతలు నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇదే సమయంలో రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, ప్రజా వ్యతిరేక పాలన చేస్తుందని మండిపడుతున్నారు.
గుజరాత్ రాష్ట్రంలో పరిణామాలపై సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్
ఇక తెలంగాణ మంత్రి కేటీఆర్ నిత్యం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేస్తున్న ట్వీట్లు రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఇప్పటికే కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తప్పుబడుతూ వరుసగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్న టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా మరోమారు ట్విట్టర్ వేదికగా బీజేపీ సర్కార్ ను టార్గెట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను, బిజెపి పాలిత రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలను పదేపదే ప్రస్తావిస్తున్న కేటీఆర్ తాజాగా గుజరాత్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు.

గుజరాత్ మెడికల్ కాలేజ్ , స్టేడియం లకు మోడీ పేరు.. టార్గెట్ చేసిన కేటీఆర్
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో ఎల్జీ మెడికల్ కళాశాల పేరుని మార్చడం పై మంత్రి కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎల్జీ మెడికల్ కళాశాల పేరును నరేంద్రమోడీ మెడికల్ కళాశాల గా మార్చినట్టు మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అంతేకాదు సర్దార్ పటేల్ స్టేడియం ను నరేంద్రమోడీ స్టేడియం గా మార్చడం పైన కూడా మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి సేవ చేసిన గొప్ప నాయకుల పేర్లున్న చోట ఆ పేర్లు మార్చి మోడీ పేరు పెడుతున్నారని కేటీఆర్ టార్గెట్ చేశారు.

కరెన్సీ నోట్ల మీద మోడీ ఫోటోలు ముద్రిస్తారేమో .. కేటీఆర్ సెటైర్లు
ఇక ఇదే సమయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పై సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. నిర్మలా సీతారామన్ కు అవకాశం ఉంటే ఆమె కూడా మహాత్మా గాంధీ స్థానంలో మోడీ ఫోటోను కొత్త కరెన్సీ నోట్లపై ముద్రించమని ఆర్బీఐ ను త్వరలో ఆదేశించవచ్చు అంటూ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాము దేశ స్వాతంత్రం కోసం కష్టపడిన నాయకులను, రాజ్యాంగ నిర్మాతను గౌరవిస్తుంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి ఈ విధంగా ఉందని మంత్రి కేటీఆర్ తన పోస్టు ద్వారా బిజెపి ని టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications