బీఆర్ఎస్ గెలవగానే కోడళ్ళకు, అత్తలకు శుభవార్త చెప్తాం: కేటీఆర్
తెలంగాణా ఎన్నికల నేపధ్యంలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో అధికార ప్రతిపక్ష పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో గెలిచిన తర్వాత తెలంగాణా కోడళ్ళకు, అత్తలకు శుభవార్త చెప్తానని పేర్కొన్నారు. అందరికీ ఏదో ఒకటి ఇచ్చారు కానీ మాకేమీ ఇవ్వలేదని కోడళ్ళు మా మీద అలిగారని, గెలవగానే కోడళ్ళకు శుభవార్త చెప్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
తెల్ల రేషన్ కార్డు ఉన్న కోడళ్ళు అందరికీ నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని అన్నారు. అలాగే అత్తలకు కూడా ఇస్తున్న పెన్షన్ ను 5 వేల రూపాయలకు పెంచుతామని పేర్కొన్నారు. ఇక తెలంగాణా రాష్ట్రాన్ని దోచుకునే పార్టీలకు ఓటు వెయ్యొద్దు అని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి 11సార్లు అవకాశం ఇచ్చారని, అప్పుడేం చేశారని ప్రశ్నించారు.

అప్పుడు ఏమీ చెయ్యని పార్టీ ఇప్పుడు చేస్తుందా అని మంత్రి కేటీఆర్ నిలదీశారు.మన జుట్టు ఢిల్లీ వాళ్ళ చేతిలో పెట్టొద్దని కేటీఆర్ సూచించారు. ఓటు వేసేటప్పుడు ఆచి తూచి ఓటు వెయ్యాలని సూచించారు. 52కిలోల బక్క కేసీఆర్ ను కొట్టేందుకు ఢిల్లీతో పాటు పక్క రాష్ట్రాల నుండి గుంపులుగా వస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
బీజేపీ నుండి మోడీ, అమిత్ షా తో పాటు 15 మంది ఇతర రాష్ట్రాల సీఎంలు, 15 మంది కేంద్ర మంత్రులు వస్తున్నారని, కాంగ్రెస్ నుండి పక్క రాష్ట్రాల పెద్ద మనుషులు వస్తున్నారని పేర్కొన్నారు. అయినా వారేమీ చెయ్యలేరని, కేసీఆర్ సింహం వంటి వాడని, సింహం సింగిల్ గానే వస్తుందని, గుంపులు గుంపులుగా వచ్చే వాళ్ళను ఏమంటారో అందరికీ తెలుసనీ మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు.
కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు ఎవరూ మరచిపోలేదని, కాంగ్రెస్ కావాలా .. కరెంట్ కావాలా తేల్చుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. అలిగినా, గులిగినా మా మీదే అలగాలని, గులగాలని, కానీ ఓట్లు మాత్రం మాకే వెయ్యండి అంటూ మంత్రి కేటీఆర్ ఓటర్లకు సూచించారు.












Click it and Unblock the Notifications