సర్పంచ్ కూడా ఆ మాటనే ధైర్యం చేయరు.. కానీ కేసీఆర్ ఛాలెంజ్ చేశారు: కేటీఆర్
ఆదిలాబాద్: గోదావరి నదిపై ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్రతో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని, తమ ప్రభుత్వ చిత్తశుద్దిని ప్రజలకు వివరించారు.
ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఏ ప్రాజెక్టును తెరపైకి తెచ్చినా.. గతంలో అంత రాష్ట్రాల వివాదాల పేరుతో వాటి ఊసే ఎత్తకుండా చేశారని తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారిన తెలంగాణ తలరాత మాత్రం మారలేదన్నారు.
కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేసే బాధ్యత సీఎం కేసీఆర్ తీసుకున్నారని గుర్తు చేశారు. ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజల సాగునీటి కల 70ఏళ్ల తర్వాత ఇప్పుడు సాకారమవబోతుందన్నారు.

కేసీఆర్ చొరవతో:
స్వయంగా కేసీఆర్, మంత్రి హరీశ్ రావులు మహారాష్ట్రతో ఒప్పందాలు కుదుర్చుకుని శాశ్వతంగా సమస్యలు పరిష్కరమయ్యేలా చేశారని గుర్తు చేశారు. ఫలితంగా జిల్లాలోని చనాఖా-కొరాట ప్రాజెక్టు.. సాత్నాల ప్రాజెక్టు, మత్తడి వాగు ప్రాజెక్టు త్వరలోనే పూర్తవబోతున్నాయన్నారు. ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా జిల్లాలోని 85వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు.
ముఖ్యమంత్రి చొరవ, జోగురామన్న కృషి వల్లనే నేడు ఆదిలాబాద్ ప్రజల సాకారమైందన్నారు.
తెలంగాణ వచ్చి మూడేళ్లయిందని..గత ప్రభుత్వాల పనితీరును, తమ ప్రభుత్వ పనితీరును బేరీజు వేసుకోవాలని ఆదిలాబాద్ ప్రజలను కోరారు.

గత ప్రభుత్వాలకు, టీఆర్ఎస్‌కు తేడా!
జిల్లాలో దాదాపు 95శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్డవారేనని, కాంగ్రెస్ హయాంలో దొంగలు పడ్డ రాత్రిలాగా అర్థరాత్రి కరెంట్ ఇచ్చారని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పగలే 9గం. నిరంతరాయ విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ వస్తే అంధకారంగా మారుతుందని విమర్శించినవాళ్లంతా ఇప్పుడు నోళ్లు మూసుకున్నారని కేటీఆర్ అన్నారు. ఇదే కార్యక్రమంలో తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా వివరించారు. ఒకనాడు కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలో రైతులు లాఠీ దెబ్బలు తినాల్సిన దుస్థితి ఉండేదని, కానీ కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఉచిత విత్తనాలు, ఎరువులు ఇచ్చేందుకు ముందుకొచ్చిందని తెలిపారు.

సంక్షేమ పథకాలు:
సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కాబట్టే.. రైతుల సమస్యలను అర్థం చేసుకుని ఈ పథకాలను రూపొందించారన్నారు. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్న సర్కార్ తమదేనన్నారు. ఆరోగ్య తెలంగాణ కోసం అమ్మఒడి కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టామని, ప్రజలెవరూ వీటి గురించి ఒత్తిడి చేయకపోయినా.. తాము ప్రజా సంక్షేమం కోసం ఇవన్నీ చేస్తున్నామని కేటీఆర్ అన్నారు.

అమ్మఒడి పథకం:
రెక్కాడితే కానీ డొక్కాడని పేదింటి తల్లులను దృష్టిలో పెట్టుకుని అమ్మ ఒడి పథకాన్ని రూపొందించామన్నారు. గర్భిణీగా ఉన్న సమయంలో వారికి కావాల్సినంత విశ్రాంతిని ఇవ్వడం కోసం ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత చంటిబిడ్డల సంక్షేమం కోసం మూడు విడతలుగా రూ.12వేల డబ్బుతో పాటు 16 రకాల వస్తువులు ఉండే కేసీఆర్ కిట్‌లను అందిస్తున్నామన్నారు.

సర్పంచ్ కూడా ఆ మాటనే ధైర్యం చేయడు..
చివరగా, ఇచ్చిన హామిలను పూర్తి చేయలేకపోతే ఓట్లడగనని చాలెంజ్ చేసిన వ్యక్తిని దేశంలో ఎక్కడైనా చూశారా? అని ప్రశ్నించారు. సీఎం స్థాయి వ్యక్తి కాదు కదా.. కనీసం సర్పంచ్ స్థాయి వ్యక్తి కూడా ఆ ధైర్యం చేయలేడని, కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ చాలెంజ్ చేశారని చెప్పుకొచ్చా,రు.