శుభవార్త.. త్వరలో మహిళల ఖాతాలలో 5 లక్షలు.. ముహూర్తం ఫిక్స్!
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇల్లు లేని నిరుపేదలు ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల రూపాయలు ఎప్పుడు ఇస్తుందని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి కసరత్తు చేస్తున్న ప్రభుత్వం కూడా త్వరితగతిన ఈ ప్రక్రియ ప్రారంభించడానికి శ్రీకారం చుట్టింది.
లబ్దిదారుల ఎంపిక డేట్ ఫిక్స్
ఇదే క్రమంలో తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం డిసెంబర్ 6వ తేదీ నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం నాలుగు దశలలో నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారుల ఎంపిక కోసం మొబైల్ యాప్
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ఆరవ తేదీ నుండి ప్రక్రియ ప్రారంభిస్తామని, దీని కోసం మొబైల్ యాప్ కూడా సిద్ధమైందని ఆయన తెలిపారు. ఈ మొబైల్ యాప్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేపు ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
వచ్చే నాలుగేళ్ళలో ఇందిరమ్మ ఇళ్ళ టార్గెట్ ఇలా
రాజకీయ పార్టీలతోనూ, ప్రాంతాలతోనూ, కులమతాలతోను ప్రమేయం లేకుండా అర్హులైన నిరుపేదలైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ల పంపిణీ పూర్తి అయ్యేవరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నట్లుగా తెలిపారు. వచ్చే నాలుగు సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఇందిరమ్మ ఇళ్ళు
ఈ పథకం కింద నిర్మించే ఇండ్లు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంతో వంటగది, టాయిలెట్ వంటి సౌకర్యాలను కలిగి ఉంటాయని ఆయన తెలిపారు. ఇక మహిళల పేరు మీదనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. మధ్యవర్తుల ప్రమేయానికి ఎటువంటి ఆస్కారం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
గ్రామాలలో గ్రామసభల ద్వారా లబ్దిదారుల ఎంపిక
గత ప్రభుత్వ సమయంలో ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టు వ్యవస్థ ఉండేదని కానీ ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దుచేసి లబ్ధిదారుల నేరుగా ఇళ్లను నిర్మించుకునే లాగా వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్నారు. యాప్ ద్వారా దరఖాస్తుదారుల డేటా నమోదు చేసి వాటి ఆధారంగా అర్హతను నిర్ణయిస్తామన్నారు. ఇక గ్రామాలలో గ్రామసభల ద్వారా లబ్ధిదారులు ఎంపిక చేపట్టనున్నారు. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా గరిష్టంగా నాలుగు లక్షల 50 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications