వడదెబ్బ మృతుల కుటుంబాలకు 4లక్షల పరిహారం ప్రకటించిన మంత్రి పొంగులేటి
తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్న సంఘటనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వడదెబ్బ వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో ఎండలు, వడగాలుల పరిస్థితులపై మంత్రి పొంగులేటి అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.
వచ్చే మూడురోజులు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి: మంత్రి పొంగులేటి
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వచ్చే మూడు రోజులు ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు అత్యవసరం లేనిదే బయటకు రాకుండా ఉండాలని సలహా ఇచ్చారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పబ్లిక్ ప్లేసెస్ లో మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు.ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.వడదెబ్బ బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.

ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యత అన్న మంత్రి పొంగులేటి
మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యత అని వివరించారు. వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి కష్టాలను కొంతైనా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది అని తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఎండల తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉందన్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లో డజన్ల సంఖ్యలో వడదెబ్బ మరణాలు నమోదయ్యాయన్నారు.
వాతావరణ శాఖ హెచ్చరికలను ప్రజలు పాటించాలి
ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు చేపట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను ప్రజలు పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎండలో బయటకు రావద్దన్నారు. నీరు, ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ తగిలినట్లు అనిపిస్తే వెంటనే సమీప ఆస్పత్రికి వెళ్లాలన్నారు.
అన్ని జిల్లాలలోనూ అవగాహనా కార్యక్రమాలు
తేలికపాటి రంగు దుస్తులు ధరించాలని, తలకు రుమాలు కట్టుకోవాలని సూచించారు.ప్రభుత్వం ఈ సమస్యను సీరియస్‌గా తీసుకుని, అన్ని జిల్లాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోందని మంత్రి పొంగులేటి అన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలోని ఈ చర్యలు వడదెబ్బ మరణాలను తగ్గించడంలో సహాయపడతాయని అధికారులు సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.













Click it and Unblock the Notifications