ఒరిగేదేంలేదు, ఎక్కడాలేదు: హుజూరాబాద్ ఫలితాలపై మంత్రి కేటీఆర్, హరీశ్ రావు, గెల్లు ఏమన్నారంటే?
హైదరాబాద్: ఉత్కంఠగా సాగిన హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఫలితాలపై స్పందించారు. టీఆర్ఎస్ ఎన్నో ఆటుపోట్లను చూసిందన్నారు.

అంతగా ప్రాధాన్యం లేదు, ఒరిగేదేం లేదు: కేటీఆర్
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 20 సంవత్సరాల్లో టీఆర్‌ఎస్ ఎన్నో ఆటుపోట్లు చూసిందన్నారు. ఎన్నికల్లో స్ఫూర్తిదాయకంగా పోరాడిన గెల్లు శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు. భవిష్యత్ పోరాటాలకు కార్యకర్తలు మరింత సన్నద్ధంగా ఉండాలని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హుజూరాబాద్ ఎన్నికకు అంతగా ప్రాధాన్యం లేదని, ఈ ఎన్నిక ఫలితంతో ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నిక కోసం మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ బాగా శ్రమించారని కొనియాడారు. అలాగే ఎమ్మెల్యేలు నేతలు, కార్యకర్తలతో పాటు సోషల్ మీడియా వారియర్స్‌కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కంటూ హరీశ్ రావు
మరోవైపు, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఎన్నికల్లో ప్రజాతీర్పును శిరసావహిస్తామన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి ఓట్లు వేసిన వారందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు హరీశ్ రావు. టీఆర్‌ఎస్ పార్టీకి ఓట్లేమీ తగ్గలేదని, అయితే.. దేశంలో ఎక్కడా లేని విధంగా హుజూరాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేశాయని.. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్లే చెబుతున్నారన్నారు హరీశ్ రావు. జాతీయస్థాయిలో కొట్లాడే బీజేపీ, కాంగ్రెస్‌లో రాష్ట్రస్థాయిలో కుమ్మక్కు కావడాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ఏది ఏమైనా టీఆర్‌ఎస్ పార్టీ ఒక్క ఎన్నికతో కుంగిపోదని, గెలిచిననాడు పొంగిపోలేదన్నారు. ఓడినా.. గెలిచిన టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పని చేస్తుందని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో హరీశ్ రావు అన్నితానై వ్యవహరించిన విషయం తెలిసిందే.

నైతిక విజయం తమదేనంటూ గెల్లు శ్రీనివాస్
ఇదిలావుండగా, హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితంపై టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కూడా స్పందించారు. ఫలితాల అనంతరం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గెల్లు శ్రీనివాస్ మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన ఓటర్లకు పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. తన గెలుపు కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని అన్నారు. ఎన్నికల్లో నైతిక విజయం టీఆర్ఎస్ పార్టీదేనని అన్నారు. టీఆర్ఎస్ ఓటమి కోసం రెండు జాతీయ పార్టీలు ఏకమయ్యాయని అన్నారు. ఈటల గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలి పశువు చేశారన్నారు. 2023లో హుజూరాబాద్ గడ్డపై టీఆర్ఎస్ జెండా ఎగురుతుందన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్‌కు శుభాకంక్షలు తెలిపారు.
Recommended Video

24,068 ఓట్ల మెజార్టీతో ఈటల రాజేందర్ గెలుపు
కాగా, హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌పై 24,068 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో మంగళవారం ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియను చేపట్టారు. 22 రౌండ్లలో ఓట్లను లెక్కించారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 1,06,780 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థికి 82,712 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు 3,012 ఓట్లు వచ్చాయి.












Click it and Unblock the Notifications