NTR 100 రూపాయిల కాయిన్ ఎక్కడెక్కడ కొనుక్కోవచ్చు ? మింట్ ప్రకటన..
దివంగత సీఎం ఎన్టీఆర్ శతజయంతి ఏడాది సందర్భంగా ఆయన స్మారకార్ధం కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణెం విడుదల చేసింది. ఈ నాణేన్ని ఇవాళ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతిద్రౌపదీ ముర్ము విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటంబ సభ్యుల్ని ఆహ్వానించారు. అలాగే రేపటి నుంచి ఈ కాయిన్ ప్రజలకు అందుబాటులో ఉంచబోతున్నారు. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ స్మారక వంద రూపాయల కాయిన్ ఎక్కడెక్కడ దొరుకుతుందన్న వివరాల్ని కేంద్ర ప్రభుత్వ ముద్రణా సంస్ధ మింట్ వెల్లడించింది.
ఇవాళ రాష్ట్రపతి విడుదల చేసిన ఎన్టీఆర్ కాయిన్ ను రేపటి నుంచి జనానికి అందుబాటులోకి తెస్తున్నట్లు మింట్ ఇవాళ ప్రకటన విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్ లో ఈ నాణెం ఎక్కడెక్కడ దొరుకుతుందో తెలిపింది. అలాగే ఆన్ లైన్లోనూ ఈ కాయిన్ ను ఎలా తెప్పించుకోవచ్చన్న వివరాల్ని మింట్ ఛీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు వెల్లడించారు. ఇందులో ఆయన.. రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ కాయిన్ కొనుగోలు కోసం అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు.

ఆన్ లైన్ లో ఎన్టీఆర్ కాయిన్ తెప్పించుకోవాలనుకునే వారు మింట్ అధికారి వెబ్ సైట్ లో ఆర్డర్ చేసేందుకు వీలు కల్పిస్తున్నారు. ఈ కాయిన్ కావాల్సిన వారు మింట్ వెబ్ సైట్ https://indiagovtmint.in/en/commemorative-coins/ లోకి వెళ్లి దీన్ని ఆర్డర్ చేసుకునేందుకు అవకాశమిచ్చారు. ఈ కాయిన్ ను నిర్ణీత మొత్తం ఆన్ లైన్లోనే చెల్లించి ఆర్డర్ చేసుకునే వీలుంది. అలాగే ఆఫ్ లైన్లో కూడా అందుబాటులో ఉంచుతున్నారు.
రేపటి నుంచి హైదరాబాద్ లోని సైఫాబాద్, చర్లపల్లి మింట్ సేల్ కౌంటర్లలో ఎన్టీఆర్ స్మారక కాయిన్ ను విక్రయిస్తారు. ఈ కాయిన్ కు ఉన్న డిమాండ్, తయారీ సమయం వంటి కారణాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి ఒక్కొక్కరికి ఒక్కో కాయిన్ మాత్రమే విక్రయించనున్నట్లు మింట్ అధికారులు తెలిపారు. డిమాండ్ తగ్గాక ఎన్ని కాయిన్లు కావాలంటే అన్ని కాయిన్లు విక్రయించే అవకాశం ఉంది. ఎన్టీఆర్ అభిమానులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications