కేసీఆర్ మాయమాటల్లో ఎక్స్‌పర్ట్ .. ప్రతిపక్షాల ఓటమికి కారణమిదే : ఎమ్మెల్యే జగ్గారెడ్డి
సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత , సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ అయిన జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. రైతులను మభ్య పెట్టడం లో, మాయ మాటలు చెప్పి మోసం చేయడంలో సీఎం కేసీఆర్ ఎక్స్‌పర్ట్ అని జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులు ఓట్లతో గెలిచారని, సీఎం కేసీఆర్ కూడా రైతు బ్యాంకు ఓట్లతోనే అధికారంలోకి వచ్చారని పేర్కొన్న జగ్గారెడ్డి, ముక్కు మొహం తెలియని వాళ్లు కూడా ఆ గాలిలో ఎమ్మెల్యేలుగా మారారని పేర్కొన్నారు.
ప్రజా సమస్యల కోసం ప్రతిపక్ష పార్టీలు ఎంత పోరాటం చేసినా, 24 గంటలు జనాల్లో ఉన్నప్పటికీ ఎన్నికల ముందు కెసిఆర్ రైతులకు పథకాలు ప్రకటిస్తున్నారని, రైతులు కెసిఆర్ మాయమాటలు నమ్ముతున్నారని అందుకే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇదే అని తేల్చి చెప్పారు . రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే ఐదవ స్థానంలో ఉందని జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కౌలు రైతులకు ప్రోత్సాహం లేదని ఆయన మండిపడ్డారు.

కెసిఆర్ తీసుకొచ్చే పథకాలు వల్లనే ప్రతిపక్షాలు ఓడి పోతున్నాయి అని పేర్కొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాష్ట్ర ప్రజలను, రైతులను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శించారు.
ఇక నిన్నటికి నిన్న కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులపై, మౌలిక వసతుల లేమి పై నిలదీస్తామని ఆయన మండిపడ్డారు. ఇక తాజాగా మరోమారు సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ప్రజా క్షేత్రంలో నిత్యం ఉంటున్నాయని, అయినా ప్రజలు కేసీఆర్ మాటలకు మోసపోతున్నారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు .












Click it and Unblock the Notifications