పాలేర్ల కన్నా ఎక్కువగా పనిచేస్తున్నాం.. మాకు ఓటెయ్యకుంటే పాపం!!
డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పనిచేసే మాకు ఓటు వేయకుంటే పాపం తగులుతుంది అంటూ ఆయన పేర్కొన్నారు. పాలేరుల కన్నా ఎక్కువగా కష్టపడుతున్నామని, అలాంటి మమ్మల్ని కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆదరించాలని ఆయన పేర్కొన్నారు.
మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే రెడ్డినాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని వర్గాలకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేలు జరుగుతుందని రెడ్యానాయక్ పేర్కొన్నారు. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలలో కచ్చితంగా గెలిచి తీరుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పండుగలకు ముందు వచ్చే గంగిరెద్దుల వాళ్ళలా రాబోయే ఎన్నికలలో తనపై పోటీ చేయడానికి సూర్యాపేట నుంచి ఎవరో రాబోతున్నారని, వారికి ఓటు అడిగే హక్కు లేదని రెడ్యానాయక్ వ్యాఖ్యానించారు.

తాము పని చేస్తున్నాం కాబట్టి ఓటు అడిగే హక్కు తమకే ఉంటుందని రెడ్యానాయక్ పేర్కొన్నారు. పార్టీలో ఎవరూ గ్రూప్ రాజకీయాలు చేయవద్దని రెడ్యానాయక్ విజ్ఞప్తి చేశారు. రైతులకు ఏ ప్రభుత్వంలో జరగనంతగా మేలు ఈ ప్రభుత్వంలో జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు ఏదో చేయాలన్న తపనతో ఉన్నారని వ్యవసాయ మార్కెట్లలో ఇచ్చే పదవులలో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఘనత కెసిఆర్ కు దక్కుతుందని రెడ్యానాయక్ పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారా చెప్పాలని రెడ్యానాయక్ ప్రశ్నించారు. ప్రకృతి విలయానికి పంటలు నష్టపోతే రైతులకు పదివేల రూపాయల పంట నష్టపరిహారం అందిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని, కానీ ఇతర రాష్ట్రాలలో చిల్లి గవ్వ కూడా ఇవ్వడం లేదని విమర్శలు చేశారు.
ఎవరెన్ని కలలు కన్నా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని రెడ్డినాయక్ తేల్చి చెప్పారు. మళ్లీ విజయం తమదేనంటూ స్పష్టం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ ఎంపీ, రెడ్యానాయక్ తనయ కవిత సైతం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు న్యాయం జరగడంలేదని కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్ని విధాల మేలు చేస్తుందని పేర్కొన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది తెలంగాణ ప్రభుత్వమేనని కవిత తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications