ఎమ్మెల్యే సీతక్క సాహసం .. కొండలు ,గుట్టలు దాటి ఏపీలోని ఆ కుగ్రామంకు వెళ్లి మరీ సేవలు
ములుగు ఎమ్మెల్యే సీతక్క కరోనా లాక్ డౌన్ సమయంలో ఆదివాసీ, గిరిజన కుగ్రామాలలో ప్రజలకు అందిస్తున్న సేవలు అన్నీ ఇన్నీ కావు. ప్రజా ప్రతినిధి అంటే ఒంటి మీద ఖద్దర్ షర్టు నలగకుండా మందీ మార్బలంతో ప్రచార ఆర్భాటాలతో నామమాత్రంగా పని చేసిన వాళ్ళే అందరికీ తెలుసు. కానీ ఎమ్మెల్యే సీతక్క సామాన్యుల్లో సామాన్యురాలిలా కలిసిపోతారు.ఎండను సైతం లెక్క చెయ్యక ,మూటలు మోసుకుంటూ తన నియోజకవర్గ ప్రజల చెంతకు తానే వెళ్తారు . వాళ్ళతోనే పట్టెడు మెతుకులు తింటారు. వారి అవసరాలు తీర్చి వస్తారు. తన వారి కోసం అలుపెరుగకుండా సీతక్క సాగిస్తున్న ప్రయాణం నిజంగా స్ఫూర్తి దాయకం. ప్రజా ప్రతినిధులందరికీ అనుసరణీయం .
Recommended Video

కొండలు, గుట్టలు, రాళ్ళు , ముళ్ళు వేటినీ లెక్క చెయ్యకుండా సాగుతున్న సీతక్క
లాక్ డౌన్ తో తిప్పలు పడుతున్న ములుగు నియోజక వర్గ గూడేలలో ఆదివాసీల ఆకలి బాధలు తీర్చటానికి నడుం బిగించిన సీతక్క స్వయంగా గిరిజన గూడేలకు వెళ్లి వారికి కావాల్సిన నిత్యావసరాలు అందించి వస్తున్నారు. కొండలు, గుట్టలు, రాళ్ళు , ముళ్ళు వేటినీ లెక్క చెయ్యకుండా ఆమె తన నియోజకవర్గ ప్రజల కోసం పరితపిస్తున్నారు. గిరిజనుల కష్టాలు తెలిసిన అక్కగా నాడు నక్సలైట్ ఉద్యమంలో పని చేసిన నేటి ఎమ్మెల్యే సీతక్క ఆదివాసీలకు అన్నం పెడుతున్న అమ్మయ్యారు .

ప్రజల కోసం నిత్యావసరాలు అందిస్తూ సీతక్క పోరాటం
అసలు ఏ ఎమ్మెల్యేకు సాధ్యం కాని పనిని ఆమె సాధ్యం చేసి చూపించారు. మనసుంటే మార్గం ఉంటుందని నిరూపించారు. తన నియోజకవర్గ ప్రజల బాధ్యత తన బాధ్యత అని భావించిన ఆమె లాక్ డౌన్ మొదలైన నాటి నుండి ప్రతి రోజూ గిరిజన గ్రామాలను చుట్టి వస్తున్నారు. వారికి కావలసిన నిత్యావసరాలు మోసుకెళ్లి అందిస్తున్నారు . తన నియోజకవర్గ ప్రజల కోసం పోరాటం సాగిస్తున్న సీతక్క తెలంగాణా రాష్ట్ర ప్రజా ప్రతినిధులకు ఒక మార్గదర్శిగా మాత్రమే కాదు మానవత్వం ఉన్న ఒక వ్యక్తిగా ఆమె తనను తాను నిరూపించుకున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలోని చింతలపాడు గ్రామ గిరిజనులకు సీతక్క సాయం
మారుమూల ప్రాంతాలకు స్వయంగా వెళ్లి వారికి నిత్యావసరాలతో పాటు డబ్బును సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో తన వయసును, ఎండను కూడా లెక్కచేయకుండా కొండలు, వాగులు దాటుకుంటూ వెళ్తూ ఆమె చేస్తున్న సాయానికి అందరూ సెల్యూట్ చేస్తున్నారు . సర్వత్రా ప్రశంసిస్తున్నారు . తాజాగా సీతక్క తన నియోజకవర్గ పరిధి దాటి ఏపీ తూర్పు గోదావరి జిల్లాలోని చింతలపాడు కుగ్రామానికి వెళ్లి అక్కడి వారికి సాయం చేశారు. దాదాపు 5 గుట్టలు దాటి ఆమె నడిచారు . అత్యంత సాహసోపేతంగా ఆమె ప్రయాణం సాగించి అమాయక గిరిజనుల చెంతకు చేరారు.

కొండగు గుట్టలు దాటి ఏపీలోని చింతలపాడు దాకా ఆమె ప్రయాణం ..
కొండా రెడ్డి, కోయ గిరిజన ప్రాంతాల్లోని ప్రజలతో కొన్ని గంటల పాటు సమయాన్ని గడిపిన సీతక్క వారికి కావాల్సిన నిత్యావసరాలు అందించారు. బియ్యం, చింతపండు, మిరపకాయలు, నూనె, పప్పు ధాన్యాలతో పాటు రూ.500 డబ్బును ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ వీడియోను చేసిన సీతక్క సీఎం వైఎస్ జగన్‌కి కూడా ఒక రిక్వెస్ట్ చేశారు. ఇక్కడి వారు చాలా రోజులుగా ఆహారం లేక బాధపడుతున్నారు. ఎన్నో ఇబ్బందులు పడి ఇక్కడికి చేరుకున్న మేము.. మాకు తోచినంత సాయం చేశామని పేర్కొన్నారు.

కుగ్రామాల గిరిజనుల కోసం సీఎం జగన్ కు విజ్ఞప్తి
చింతలపాడులో గ్రామ వలంటీర్లు లేరని, ఇక్కడి వారికి నెలవారీ రేషన్ కూడా అందడం లేదన్నారు సీతక్క . కొండారెడ్డి గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నా అని ఆమె పేర్కొన్నారు. ఇక వారి వద్దకు వెళ్ళిన సంతోషాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తల మీద బరువు ఉన్న వెళ్లేటప్పుడు మాత్రం కొండల్లో ఉన్న పేద ప్రజల ఆకలి తీరుస్తామని ఆనందంతో వెళ్లా కానీ తిరుగు ప్రయాణంలో తల మీద బరువు లేకపోయినా అలసిపోయిన కాళ్లతో ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు పడ్డాను, అయినా సంతోషమే వాళ్ళ బాధ ఈరోజు ప్రపంచమంతా తెలుసుకుంది మంచి జరుగుతుందని భావిస్తున్నాను అంటూ ఆమె పోస్ట్ చేశారు .,తన నియోజకవర్గ ప్రజలనే కాక , సరిహద్దుల్లో ఉన్న పక్క రాష్ట్ర గిరిజన గూడెంలో సైతం సాయమందించిన మనసున్న అక్క సీతక్క స్పూర్తికి హ్యాట్సాఫ్.












Click it and Unblock the Notifications