మంత్రి ఎర్రబెల్లికి సీతక్క సవాల్!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు .ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టు కోసం ప్రయత్నం చేస్తున్న బి ఆర్ ఎస్ ములుగుపై ఫోకస్ చేస్తుంది. ములుగులో గులాబీ జెండా ఎగురవేయాలని, ఎమ్మెల్యే సీతక్కకు చెక్ పెట్టాలని భావిస్తూ సీతక్కపై పోటీకి బడే నాగ జ్యోతిని రంగంలోకి దింపింది.
బడే నాగజ్యోతి కూడా సీతక్క సామాజిక వర్గమే కావడం, ప్రజా పోరాటాల కుటుంబం కావడంతో సీతక్క కు బడే నాగజ్యోతి చెక్ పెడుతుందని బి ఆర్ ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ములుగు నియోజకవర్గంలో పర్యటించి బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుంది అంటూ ప్రకటన చేశారు.

సర్వేలన్నీ తమకు అనుకూలంగా వచ్చాయని ములుగు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురే లేదని, వచ్చే ఎన్నికలలో వార్ వన్ సైడ్ గా ఉంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. పేదల కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర నాగజ్యోతి కుటుంబానికి ఉందని పేర్కొన్న ఆయన ఎమ్మెల్యే సీతక్కను టార్గెట్ చేశారు.
దీంతో మంత్రి ఎర్రబెల్లిపై విరుచుకుపడిన ఎమ్మెల్యే సీతక్క డబ్బుల సంచులకు ప్రజా సేవకు మధ్య యుద్ధం మొదలైందని , బీఆర్ఎస్ మంత్రులకు పక్క నియోజకవర్గాల మీద ఉన్న ప్రేమ తమ నియోజకవర్గాల మీద ఉండడం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు సవాల్ విసిరిన ములుగు ఎమ్మెల్యే సీతక్క పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధిపై మంత్రికి ఛాలెంజ్ చేశారు.
పాలకుర్తిలో ఇంటర్, డిగ్రీ ప్రభుత్వ కళాశాలలు తెచ్చానని ఎర్రబెల్లి దయాకర్ రావు గొప్పలు చెప్పుకుంటున్నారు అంటూ మండిపడ్డారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎన్ని కళాశాలలు తెచ్చారు? వంద పడకల ఆసుపత్రి ఇస్తామన్నారు ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. మంత్రి నియోజకవర్గమైన పాలకుర్తిలో, తన నియోజకవర్గమైన ములుగులో అభివృద్ధి ఎలా ఉందో చూద్దామా అంటూ సవాల్ విసిరారు. ఎవరు ఎలాంటి వారో ప్రజలే నిర్ణయిస్తారు అంటూ ఎమ్మెల్యే సీతక్క దయాకర్ రావుకు చురకలు అంటించారు.












Click it and Unblock the Notifications