MLC Kavitha బెయిల్ పిటీషన్ పై తేలేది నేడే; బెయిల్ వస్తుందా? సర్వత్రా ఉత్కంఠ!!
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. తన చిన్న కుమారుడు పరీక్షల కారణంగా ఏప్రిల్ 16వరకు బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 26వ తేదీన బెయిల్ పిటిషన్ కవిత దాఖలు చేసినప్పటికీ ఇప్పటివరకు, ఈ కేసులో బెయిల్ రాలేదు.
నేడు మళ్ళీ కవిత బెయిల్ పిటీషన్ పై విచారణ
అంతకుముందు ఈ కేసులో బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగిన సమయంలో కవితకు ఏ బెయిల్ కావాలో - మధ్యంతర బెయిల్ లేదా రెగ్యులర్ బెయిల్ అనేది నిర్ణయించుకోవాలని కవిత తరఫు వాదించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీని కోరుతూ కోర్టు విచారణను ఏప్రిల్ 4కి వాయిదా వేసింది.నేడు మళ్లీ కోర్టులో బెయిల్ పిటీషన్ పై విచారణ జరగనున్న కవిత తరపున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించనున్నారు.

ఈడీ వాదన ఇదే
అయితే ఈడి అధికారులు మాత్రం కవితకు మధ్యంతర బెయిల్, సాధారణ బెయిల్ రెండింటిలో ఏది ఇవ్వద్దని వ్యతిరేకిస్తున్నారు. కవిత బయటకు వస్తే సాక్షులను, ఆధారాలను కవిత ప్రభావితం చేస్తారని ఈడి వాదిస్తోంది. కవిత బెయిల్ పై బయటకు వస్తే దర్యాప్తు పైన ప్రభావం పడుతుందని ఈడి అధికారులు చెబుతున్నారు.
ఏప్రిల్ 9 వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీ
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో ఎమ్మెల్సీ కవితను గత నెల 15వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. మొదట పది రోజులపాటు ఈడి కస్టడీకి కవితను అప్పగించిన కోర్టు ధర్మాసనం, ఆపై ఆమెను జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఏప్రిల్ 9 వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
కవిత బెయిల్ పిటీషన్ తిరస్కరించిన సుప్రీం కోర్టు
కాగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తన అరెస్టు అక్రమమని కవిత రౌస్ అవెన్యూ కోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ ఈడి అరెస్టును సవాల్ చేశారు. రెండు కోర్టుల లోను కవితకు చుక్కెదురైంది. ఆపై కవిత తనకు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, మార్చి 22వ తేదీన సుప్రీంకోర్టు ఆమె బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ట్రయల్ కోర్టులోనే బెయిల్ కోసం అప్పీలు చేసుకోవాలని సూచించింది.
కవితకు బెయిల్ వస్తుందా?
దీంతో మళ్లీ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కవిత పిటిషన్ పై సమాధానం చెప్పాలని న్యాయస్థానం ఈడీకి నోటీసులు జారీ చేస్తూ విచారణను నేటికి వాయిదా వేసింది. నేడు ఈ పిటిషన్ పై ఈడి కోర్టుకు ఏం సమాధానం చెబుతుంది? కోర్టు కవితకు బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అన్నది అందరిలోనూ ఉత్కంఠ రేకెత్తిస్తుంది.












Click it and Unblock the Notifications