రేపు తెలంగాణాలో రైతు మహాధర్నా: ఎందుకో చెప్పిన ఎమ్మెల్సీ కవిత!!
రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు మహాధర్నా చేపడుతున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఈ రైతు మహాధర్నాలో రైతులు అందరూ పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. దేశంలో పాలు, పెరుగు లాంటి వాటిపై, రైతులు ఉత్పత్తి చేసే వాటిపైనా పన్నులను విధిస్తున్న కేంద్రం, కార్పొరేట్ సంస్థలు తీసుకున్న 19 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయడం దుర్మార్గమని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

కేంద్రంపై విరుచుకుపడిన ఎమ్మెల్సీ కవిత
ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో నుండి తరలిన నల్లధనం తెస్తానని ప్రధాని మోడీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. బ్యాంకులు దివాలా తీసేలా ఉన్నా, కార్పొరేట్ సంస్థలు తీసుకున్న రుణాలను మాఫీ చేసిన కేంద్రం రైతులు, ప్రజలు తీసుకున్న అప్పులను మాత్రం వడ్డీతో సహా వసూలు చేస్తోందన్నారు ఎమ్మెల్సీ కవిత. దేశ సంపద తరలిపోతుంటే తాము జిమ్మేదారులమని, చౌకీదారులమని చెప్పిన బీజేపీ నేతలు నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అనేది ఇప్పటికే పలుమార్లు రుజువైందన్నారు.

రైతు వ్యతిరేక బీజేపీపై నిరసనగా రేపటి రైతు ధర్నా
పంజాబ్‌లో ఎన్నికలొస్తే క్షమాపణలు అడగాల్సిన పరిస్థితి మోడీకి వచ్చిందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద తెలంగాణలో కల్లాల నిర్మాణాల కోసం కేటాయించిన నిధులను వెనక్కి ఇవ్వాలని కోరడం దుర్మార్గమన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అందుకే రైతు వ్యతిరేక బీజేపీకి నిరసనగా రేపటి రైతు ధర్నాను నిజామాబాద్‌తో పాటు ప్రతీ జిల్లాలోనూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో రైతుల, ప్రజల సంక్షేమ కోసం పనిచేసే పార్టీ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.

తెలంగాణా ప్రజలు చంద్రబాబును రిజెక్ట్ చేశారు
చుక్కలు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒక్కడే అన్నట్లు తెలంగాణ లో కేసీఆర్ ఒక్కడే అన్నారు. టీడీపీ రాజకీయాలు తెలంగాణలో చెల్లవు అని కవిత వ్యాఖ్యానించారు. చంద్ర బాబు వచ్చి మళ్లి ఇక్కడ పార్టీని పునరుద్ధరించాలని అనుకుంటున్నాడని, వాళ్లు తెలంగాణ బాగును కోరిన వాళ్ళు కాదన్నారు. వాళ్ళను తెలంగాణ ప్రజలు రిజెక్ట్ చేసారని గుర్తు చేశారు. ఇప్పుడు వచ్చి రాజకీయం చేద్దాం అనుకున్న మళ్లి రిజెక్ట్ చేస్తారు అని ఎమ్మెల్సీ కవిత జోష్యం చెప్పారు.

కేంద్రం తీరు దుర్మార్గం: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం కింద రైతులు కల్లాలు కట్టుకుంటే డబ్బులు వాపస్ ఇవ్వాలని కేంద్రం ఆదేశించడం దుర్మార్గం అన్నారు. బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన రోజులు వచ్చాయన్నారు. తెలంగాణలో ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. రైతుల కోసం తెలంగాణలో ఇప్పటివరకు రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రేపు నిజామాబాద్ ధర్నా చౌక్‌లో రైతు మహా ధర్నాకు రైతులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని మంత్రి పిలుపునిచ్చారు.

ఎర్రకోటపై బీఆర్‌ఎస్ జెండా ఎగరవేస్తాం : ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
బీజేపీ నేతలు తెలంగాణకు పట్టిన చీడ పురుగులు అని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఫ్యామిలీపై అనవసర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి బండి సంజయ్, అరవింద్‌లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. తాము ఈడీ దాడులు కేసులకు భయపడమన్నారు. ఎర్రకోటపై బీఆర్‌ఎస్ జెండా ఎగరవేస్తామన్నారు. డ్రగ్స్ టెస్టులకు అందరి వెంట్రుకలు ఇస్తామన్నారు. కేసీఆర్‌తో పెట్టుకుంటే మాడి మసైపోతారన్నారు. అన్ని సర్వేలు మా వైపే ఉన్నాయని వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు ఖాయమన్నారు.












Click it and Unblock the Notifications