మోడీ చౌకీదార్ గా పనికిరాడు.. కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు కేంద్రాలు పెట్టాడు .. రేణుకా చౌదరి ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రధానంగా ఖమ్మం లోకసభ స్థానం నుండి ఇద్దరు హేమాహేమీలు తలపడనున్న నేపథ్యంలో లోక్ సభ స్థానం ఎవరు కైవసం చేసుకుంటారు అన్న ఉత్కంఠ నెలకొంది. టిఆర్ఎస్ పార్టీ నుండి నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నుండి రేణుకా చౌదరి ఈ ఎన్నికల్లో ప్రధానంగా తలపడనున్నారు. ఇప్పటికే రేణుకా చౌదరి ఖమ్మం లో పాగా వేస్తానన్న గట్టి ధీమాతో ప్రచారం నిర్వహిస్తున్నారు.ఇదే క్రమంలో బిజెపి సర్కార్ పైన, టిఆర్ఎస్ పార్టీ పైన ఆమె నిప్పులు చెరుగుతున్నారు.
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చౌకీదార్ ఉద్యోగానికి కూడా పనికిరాడని రేణుక చౌదరి బీజేపీ పై విరుచుకు పడ్డారు. ప్రజల డబ్బు దోచుకుని విదేశాలకు పారిపోయిన వారిని పట్టుకోకుండా చోద్యం చూస్తున్న వారు చౌకీదార్ ఉద్యోగానికి ఎలా పనికొస్తారు అంటూ ఆమె ప్రశ్నించారు. ఇక కుటుంబంలోని అనురాగాలను, ఆప్యాయతను గురించి తెలుసుకోలేని వారు దేశం పై ఏ విధమైన ప్రేమను చూపిస్తారు అని మోడీ పై మండిపడ్డారు రేణుక చౌదరి. ఇక కేసీఆర్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన రేణుకా చౌదరి రాష్ట్రంలో రైతుల పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేరు కానీ ఎమ్మెల్యేలను కొనేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని కేసీఆర్ సర్కార్ పై ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకాచౌదరి ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను బహిరంగంగా కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఖమ్మం రూరల్ మండలంలో కాంగ్రెస్, టీడీపీ కార్యరక్తల సమావేశంలో మాట్లాడిన రేణుకా చౌదరి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేలా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాలని సూచించారు. దేశ సమగ్రతను కాపాడేందుకు రాహుల్ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉందని, వారిది త్యాగాల కుటుంబం అని చెప్పిన రేణుకా చౌదరి, బిజెపి, టిఆర్ఎస్ పార్టీల అసమర్థ పాలనను ప్రజల్లో ఎండగట్టాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పనిని సమర్థవంతంగా చేయాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications