మనోజ్ విషయంలో స్పందించిన మోహన్ బాబు... ఆ పనిచేస్తానన్నపెదరాయుడు!
మంచు మోహన్ బాబు తన ఇంట్లో జరుగుతున్న కుటుంబ కలహాల పైన తాజాగా స్పందించారు. ఏ ఇంట్లో అయినా గొడవలు సహజంగా జరుగుతాయని అయితే ఆ ఇంటి గొడవలను అంతర్గతంగా పరిష్కరించుకుంటారని ప్రముఖ సినీ నటుడు అయినటువంటి మోహన్ బాబు తెలిపారు .తన ఇంట్లో కూడా అటువంటి విభేదాలు వచ్చాయని పేర్కొన్న ఆయన వాటిని పరిష్కరించుకుంటామని వెల్లడించారు.
కుటుంబ వివాదాలపై స్పందించిన మోహన్ బాబు
అంతే కాదు గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలను తాను పరిష్కరించినట్టు మోహన్ బాబు పేర్కొన్నారు. తాను చేసిన కృషి వల్ల చాలా కుటుంబాలు కలిసి ఉన్నాయన్నారు. ఇప్పుడు తన కుటుంబంలోని సమస్యలు కూడా తానే పరిష్కరించుకుంటానని మోహన్ బాబు వెల్లడించారు. ఇది ఇలా ఉంటే సన్నిహితుల సమక్షంలో జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసంలో మోహన్ బాబు విష్ణు మనోజ్ మధ్య చర్చలు జరుగుతున్నాయి.

సన్నిహితుల సమక్షంలో జరుగుతున్న చర్చలు
ఇప్పటికే సోమవారం పలువురు సన్నిహితుల సమక్షంలో మోహన్ బాబు మనోజ్ వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇక నేడు దుబాయ్ నుంచి విష్ణు కూడా తిరిగి రావడంతో పాటు ముంబై నుంచి మంచు లక్ష్మి కూడా రావడంతో నేడు మరో మారు వీరి కుటుంబ చర్చలు జరుగుతున్నాయి.
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు
అయితే మంచు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న ఆస్తుల వివాదం తీవ్ర చర్చాంశనీయం కావడంతో పాటు ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ లేఖలు విడుదల చేయడం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం వంటి పరిణామాలకు కారణమైంది. తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
మనోజ్ పైన, మౌనిక పైన కేసు నమోదు
మనోజ్ తో తనకు ప్రాణహాని ఉందని తనను తన ఆస్తులను కాపాడాలని మోహన్ బాబు లేఖ ద్వారా రాచకొండ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు . దీంతో మంచు మనోజ్ తో పాటు ఆయన భార్య మౌనిక పైన పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తంగా వీరి కుటుంబ పంచాయితీ రచ్చకెక్కడంతో తాజాగా నేడు చర్చల నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications