ఎమ్మెల్యేలకు ఎర కేసు: నిందితుల ఇంట్లో సిట్ సోదాలు, మరి కొందర్ని అరెస్టుకు ఛాన్స్
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సోదాలు కొనాసగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, హర్యానా, కేరళ, కర్ణాటకతోపాటు హైదరాబాద్ లోనూ సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏడు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్న సిట్ అధికారులు.. హర్యానాలో రామచంద్రభారతి నివాసంతోపాటు కర్ణాటకలో ఆయనకు సంబంధించిన ఇంటిలోనూ సోదాలు చేస్తున్నారు.
మరోవైపు, తిరుపతిలో సింహయాజీకి చెందిన ఆశ్రమానికి వెళ్లిన మరో బృందం సోదాలు చేస్తోంది. హైదరాబాద్‌లోని నందకుమార్ కు చెందిన ఇల్లు, హోటల్ లో సోదాలు చేశారు. కేరళలోని కొచ్చిలో ఉండే ఓ వైద్యుడు రామచంద్రభారతికి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.

ఈ క్రమంలో సదరు వైద్యుడి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఓ జాతీయ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి బంధువు తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి సింహయాజీకి విమానం టికెట్ బుక్ చేసినట్లు సిట్ గుర్తించింది. దర్యాప్తులో భాగంగా సోదాల అనంతరం మరికొంత మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, హైదరాబాద్‌లో నందకుమార్ కు చెందిన పలు ప్రాంతాల్లో సిట్ అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. ఫిల్మ్ నగర్ ఆదిత్య హిల్ టాప్ అపార్ట్‌మెంట్‌లోని ఆరో అంతస్తులో ఉన్న నందకుమార్ ఇంట్లో దాదాపు ఆరు గంటలపాటు సోదాలు చేశారు.
ఇది ఇలావుండగా, హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలో భాగంగా.. నందకుమార్ కు చెందిన హోటల్ దక్కన్ కిచెన్ సమీపంలోని రెండు నిర్మాణాలను జీహెచ్ఎంసీ కూల్చివేసింది. దక్కన్ కిచెన్ ను ప్రమోద్ కుమార్ అనే వ్యక్తితో కలిసి నందకుమార్ నిర్వహిస్తున్నారు. అక్రమ నిర్మాణాల్లో వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు గతంలోనే దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చారు. అయినా, ఆపకపోవటంతో పోలీసుల బందోబస్తు నడుమ జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేత ప్రారంభించారు.












Click it and Unblock the Notifications